
ఒకప్పుడు అద్భుతమైన సినిమాలతో మనల్ని మెప్పించిన సెన్సేషనల్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, గత కొంతకాలంగా తన మార్క్ సినిమాను తీయలేకపోయారు. అయితే అభిమానులు మాత్రం ఎప్పుడెప్పుడు వర్మ తన మార్క్ సినిమా తీస్తాడా అని ఎదురుచూస్తూనే ఉన్నారు. తాజాగా వర్మ తనకు బాగా అలవాటైన క్రైమ్ నేపథ్యంలో, సర్కార్ తరహా కథాంశంతో ‘అటాక్’ అనే సినిమా ద్వారా మనముందుకు వస్తోన్న విషయం తెలిసిందే! మంచు మనోజ్ హీరోగా రూపొందుతోన్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.
ఇక ఇప్పటికే ట్రైలర్‌తో ఆకట్టుకున్న ఈ సినిమా తాజాగా మరో సరికొత్త ట్రైలర్‌తో మెప్పించేందుకు సిద్ధమవుతోంది. రేపు (అక్టోబర్ 7న) అటాక్ సినిమాకు సంబంధించిన రెండో ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు వర్మ తెలిపారు. ఇక నవంబర్ నెలలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తేనున్నట్లు వర్మ ఈ సందర్భంగా ప్రకటించారు. ప్రకాష్ రాజ్, జగపతి బాబు తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా వర్మ మార్క్ గ్యాంగ్‌స్టర్ బేస్‌డ్ కథతో రూపొందిస్తున్నారు.

