ఎట్టకేలకు తమిళనాడులో ‘బాహుబలి-2’ షో పడింది !

28th, April 2017 - 12:15:52 PM


భారీ అంచనాల నడుమ ‘బాహుబలి-2’ చిత్రం ఈరోజే ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇండియాలోని అన్ని చోట్ల ఎలాంటి సమస్యా లేకుండా సినిమా రిలీజవగా ఒక్క తమిళనాడులో మాత్రం మార్నింగ్ షోలు ప్రదర్శితం కాలేదు. దీంతో తెల్లవారుజాము నుండి థియేటర్ల వద్ద పడిగాపులు కాసిన అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. పలు చోట్ల ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొంది. దీనికి తమిళనాడు హక్కుల్ని కొన్న డిస్ట్రిబ్యూటర్లకు, చిత్ర నిర్మాతలకు మధ్య తలెత్తిన ఆర్ధిక లావాదేవీలే కారణమని తెలుస్తోంది.

ముందుగా అనుకున్న మొత్తం చెల్లించకపోవడంతో నిర్మాతలు ఉదయం షోలను వేయరాదంటూ అన్ని ఏరియాల డిస్ట్రిబ్యూటర్లకు తెలిపారు. చివరికి ఇరు పార్టీల మధ్య జరిగిన చర్చలతో ఈ సమస్య కాస్త సద్దుమణిగి 11 గంటల షోలు మొదలయ్యాయి. ఇది కూడా సమస్యకు పూర్తి పరిష్కారం కాదని, ఈరోజు వరకు మాత్రమే షోలు వేసేందుకు అనుమతి ఉందని, ఇంకా రేపటి విషయం తేలలేదని తెలుస్తోంది.