
బాహుబలి దేశావ్యాప్తంగా సృష్టిస్తోన్న రికార్డుల వేట మూడో వారమైనా అలా కొనసాగుతూనే ఉంది. దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ విజువల్ వండర్ విడుదలైన అన్ని చోట్లా రికార్డుల మోత మోగిస్తోంది. తెలుగు, తమిళ, మళయాల, హిందీ భాషల్లో ఒకేసారి విడుదలైన ‘బాహుబలి’, ఇండియన్ సినిమా స్థాయిని పెంచిన సినిమా అంటూ అంతర్జాతీయ పత్రికలు సైతం కొనియాడాయి.
ఇక ఈ సినిమా అన్ని చోట్లా బ్లాక్‌బస్టర్‌గా నిలవడానికి రాజమౌళి విజన్, ఆర్ట్ వర్క్, ఇంతకు ముందెన్నడూ ఇండియన్ సినిమాలో చూడని గ్రాండియర్ ఒక ఎత్తైతే తమిళ ప్రేక్షకులూ ఈ సినిమా తమదిగా భావించడానికి సత్యరాజ్, రమకృష్ణ తదితర కీలక నటులు ఈ సినిమాలో భాగం కావడమే!
ఇక హిందీలో డబ్బింగ్ సినిమాలనేవీ ఎప్పుడూ ఆడిన దాఖలాలు నేపథ్యంలోనూ బాహుబలి కొల్లగొట్టిన కలెక్షన్లు చూస్తే ఈ సినిమా రేంజ్ ఏంటో తెలిసిపోతుంది. అయితే హిందీ ప్రేక్షకులకు ఈ సినిమా చూస్తున్నపుడు కలిగే ఒకే లోటంటే.. తాము బాగా ఇష్టపడే తమవారైన నటులు లేకపోవడం. తాజాగా ఆ లోటును తీర్చే దిశగా రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బాహుబలి పార్ట్ 2 లో కొందరు హిందీ నటులను కూడా నటింపజేసే ఆలోచనలో ఉన్నారట. ఈ విషయమై మరిన్ని వివరాలు తెలియాలంటే బాహుబలి పార్ట్ 2 సెట్స్‌పైకి వెళ్ళేదాకా ఆగాల్సిందే!

