దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చారిత్రక చిత్రం ‘బాహుబలి’. ఈ సినిమా కోసం కేవలం తెలుగు ప్రేక్షకులే కాకుండా యావత్ దేశం ఎదురు చూస్తుందనడంలో సందేహం లేదు. మొదటగా మే 15నే ‘బాహుబలి’ మొదటి భాగాన్ని విడుదల చేయనున్నామన్న విషయాన్ని ప్రకటించినా సినిమాకు సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్ పనులు పెండింగ్‌లో ఉండడంతో సినిమాను జూలైకి వాయిదా వేశారు. బాహుబలి మొదటి భాగాన్ని ‘బాహుబలి ది బిగినింగ్’గా పిలుస్తున్నారు.
తాజాగా జూలైలో ఏ రోజున ఈ సినిమా విడుదలవుతుందన్న విషయాన్ని కూడా ఖరారు చేశారు. బాహుబలి సినిమాను హిందీలో విడుదల చేయనున్న ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహర్ ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా తెలియజేశారు. జూలై 10న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. ఎప్పట్నుంచో ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు జూలై 10.. నిజంగా పండగే అవుతుందనడంలో అతిశయోక్తి లేదు.
కాగా బాహుబలి ట్రైలర్‌ను మే 31న విడుదల చేయనున్నట్లు రాజమౌళి ప్రకటించిన విషయం తెలిసిందే. అదే విధంగా ట్రైలర్ విడుదలకు నెలరోజుల ముందునుంచే అంటే నేటి (మే 1) నుంచే బాహుబలి సందడి మొదలుపెట్టారు. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు సినిమాకు సంబంధించిన ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. నీళ్ళ మధ్యలోనుండి ఓ స్త్రీ పసివాడిని బయటకు తీసుకువచ్చే ప్రయత్నాన్ని ఈ పోస్టర్‌లో చూడొచ్చు. ‘ఏ రకంగా బయటకొచ్చినా, తాను సాధించాల్సిన దానికోసం పోరాడి తీరతాడు’ అన్న అర్థం వచ్చేలా ట్వీట్ చేసి రాజమౌళి ఈ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాను ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోబు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీత సారధ్యంలో రూపొందిన ఆడియోను జూన్ నెలలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.


