
దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘బాహుబలి’ సినిమా ఎల్లలనేది లేకుండా అన్ని చోట్లా బంపర్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. తెలుగు, తమిళ, మళయాల, హిందీ భాషల్లో ఒకేసారి విడుదలైన ఈ సినిమా దేశ వ్యాప్తంగా సరికొత్త రికార్డులను సృష్టిస్తూ తెలుగు సినిమా సత్తాను చాటుతుండగా, దేశం అవతల కూడా అదే స్థాయి రికార్డు కలెక్షన్లతో దుమ్మురేపుతోంది.
అమెరికాలో తెలుగు సినిమా ఇంతకుముందెన్నడూ చూడని రేంజ్‌లో కలెక్షన్లు కొల్లగొడుతూ, హాలీవుడ్ వాకిట్లో ‘బాహుబలి’ తెలుగు సినిమా సత్తాను చాటుతోంది. మొదటి వారాంతం 4.4మిలియన్ డాలర్లు కొల్లగొట్టి అమెరికాలో ఈ సినిమా టాప్ 10 జాబితాలో తొమ్మిదవ స్థానంలో నిలిచింది. ప్రఖ్యాత న్యూయార్క్ టైమ్స్ విడుదల చేసిన ఈ వారాంతపు బాక్సాఫీస్ రిపోర్ట్‌లో హాలీవుడ్ భారీ సినిమాలైన జురాసిక్ వరల్డ్, టెర్మినేటర్, ఇన్‌సైడ్ ఔట్ లాంటి సినిమాల సరసన బాహుబలి నిలవడం విశేషం. పైన చెప్పుకున్న సినిమాలన్నీ సుమారు వెయ్యికిపైగా థియేటర్లలో నడుస్తుండగా కేవలం 236 థియేటర్ల నుంచే ‘బాహుబలి ఈ స్థాయి కలెక్షన్లు కొల్లగొట్టడం గమనార్హం. పలు హాలీవుడ్ సినిమాలను సైతం వెనక్కి నెట్టేసి బాహుబలి తొమ్మిదవ స్థానంలో నిలిచింది.
ప్రభాస్, రానా, అనుష్క, తమన్నాలు ప్రధాన పాత్రల్లో నటించగా ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించిన ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్, భారీ ఆర్ట్ వర్క్స్, రాజమౌళి విజన్ అన్ని వర్గాల ప్రేక్షకులనూ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

