
దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘బాహుబలి’. యావత్ దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రతీ విషయం మొదట్నుంచీ సెన్సేషన్‌గా నిలుస్తూ వస్తోంది. ఇప్పటికే వినూత్నంగా భారీ ఎత్తున నిర్వహించిన తెలుగు ఆడియో రిలీజ్ వేడుక బంపర్ హిట్ కాగా; తమిళ, మళయాల ఆడియోలను సైతం మరింత వినూత్నంగా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా నిలుస్తూ వచ్చిన ఈ సినిమా ఆన్లైన్ రికార్డుల్లో సంచలనాలను రేపింది.
తాజాగా బాహుబలి మళయాల ఆడియో రిలీజ్ వేడుక విషయంలో ఓ సరికొత్త వరల్డ్ రికార్డు నెలకొల్పే దిశగా ప్లాన్ చేస్తున్నారు. ఆ రికార్డుకు సంబంధించిన విషయాలేవీ ఇంకా తెలియకపోయినా బాహుబలి టీమ్ ఓ ప్రయోగంతో ఈ రికార్డుకు సిద్ధమవుతుందని తెలుస్తోంది. తమిళ ఆడియో లాంచ్ జూన్ 24న జరగనుండగా, వరల్డ్ రికార్డును నెలకొల్పే దిశగా ప్లాన్ చేసిన మళయాల ఆడియో కొచ్చి ప్రాంతంలో భారీ ఎత్తున జూన్ 27న సాయంత్రం 4 గంటలకు జరగనుంది.

