
దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘బాహుబలి’. యావత్ దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్నీ జాగ్రత్తగా నిర్వహిస్తూ వస్తున్న టీమ్, సినిమా విడుదలకు దగ్గరపడడంతో అన్ని భాషల్లోనూ ప్రచారాలను వేగవంతం చేసింది. ఇప్పటికే తెలుగులో ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరిపోయాయి. కీరవాణి సంగీత దర్శకత్వంలో రూపొందిన ఆడియో ఈ మధ్యే విడుదలై సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. ఇక ఈ సాయంత్రం తమిళ ఆడియోను కూడా విడుదల చేశారు.
తమిళంలో ఇంతకుముందే బాహుబలి ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించి ఉండడంతో, ఆడియోను వేడుక లాంటిది నిర్వహించకుండా నేరుగా మార్కెట్‌లోకి విడుదల చేశారు. చెన్నైలోని పలు ఎఫ్.ఎం.స్టేషన్ల ద్వారా ఆడియో రిలీజ్ అయింది. ఇదిలా ఉంటే బాహుబలి మళయాల ఆడియో రిలీజ్ వేడుక విషయంలో మాత్రం ఓ సరికొత్త వరల్డ్ రికార్డు నెలకొల్పే దిశగా ప్లాన్ చేస్తున్నారు. ఆ రికార్డుకు సంబంధించిన విషయాలేవీ ఇంకా తెలియకపోయినా బాహుబలి టీమ్ ఓ ప్రయోగంతో ఈ రికార్డుకు సిద్ధమవుతుందని తెలుస్తోంది.
వరల్డ్ రికార్డును నెలకొల్పే దిశగా ప్లాన్ చేసిన మళయాల ఆడియో కొచ్చి ప్రాంతంలో భారీ ఎత్తున జూన్ 27న సాయంత్రం 4 గంటలకు జరగనుంది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నాలు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జూలై 10న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, మళయాల, హిందీ భాషల్లో ఒకేసారి భారీ ఎత్తున విడుదల కానుంది.