దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘బాహుబలి’ నిన్న ప్రపంచవ్యాప్తంగా నాలుగు ప్రధాన భాషల్లో భారీ ఎత్తున విడుదలైన విషయం తెలిసిందే. గత కొన్ని దశాబ్దాల కాలంలో ఈ స్థాయి అంచనాల మధ్య వేరే ఏ ఇతర సినిమా విడుదల కాని నేపథ్యంలో ‘బాహుబలి’ సినిమాను మొదటి రోజే చూసేయాలన్న ఆతృతలో ప్రతీ సినీ అభిమానీ ఎదురుచూశారు. ఈ క్రమంలోనే ఈ సినిమాను చాలా ఎక్కువ థియేటర్లలో విడుదల చేశారు.
విజయవాడలో ఈ సినిమా సుమారు 159 థియేటర్లలో విడుదలై ఓ రికార్డు సృష్టించింది. అన్ని చోట్లా కనీవినీ ఎరుగని స్థాయిలో విడుదలైన ఈ సినిమా విజయవాడలో ఈ స్థాయి థియేటర్లలో విడుదల కావడం ఓ సంచలనం. ఇక దేశవ్యాప్తంగా 4000 థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మొదటిరోజు కలెక్షన్లను కుమ్మేసింది. ఇండియాలో మొదటిరోజు అత్యధిక కలెక్షన్లను కొల్లగొట్టిన సినిమాగా ’బాహుబలి’ నిలిచి చరిత్ర సృష్టించింది.


