రేణు దేశాయ్ ప్రధాన పాత్రలో, ఫణి ప్రదీప్ ధూళిపూడి (మున్నా) దర్శకత్వంలో తెరకెక్కిన ‘బ్యాడ్ గాళ్స్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌తో దూసుకుపోతోంది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదలైన ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతున్న తరుణంలో చిత్ర యూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా దర్శకుడు మున్నా మాట్లాడుతూ, భారీ పోటీలోనూ ప్రేక్షకులు తమ చిత్రాన్ని ఆదరించడం సంతోషంగా ఉందని, ‘జాతి రత్నాలు’, ‘మ్యాడ్’ తరహాలో ఈ చిత్రం పూర్తిస్థాయి ఎంటర్టైనర్‌గా నిలిచిందని పేర్కొన్నారు.
అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం, చంద్రబోస్ సాహిత్యం సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయని చిత్ర బృందం అభిప్రాయపడింది. థియేటర్ల నుంచి వస్తున్న అనూహ్య స్పందన మేరకు షోల సంఖ్యను, స్క్రీన్లను పెంచుతున్నట్లు నిర్మాతలు శశిధర్ నల్ల, రామిశెట్టి రాంబాబు వెల్లడించారు. సినిమా ప్రథమార్ధం యూత్ మెచ్చేలా, ద్వితీయార్ధం భావోద్వేగాలతో కుటుంబ ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా ఉందని నటీనటులు పాయల్ చెంగప్ప, రోషిణి తెలిపారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ‘బ్యాడ్ గాళ్స్’ రాబోయే రోజుల్లో మరిన్ని వసూళ్లు సాధిస్తుందని టీమ్ ధీమా వ్యక్తం చేసింది.


