
దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చారిత్రక చిత్రం ‘బాహుబలి’ రిలీజ్ ఎప్పుడు ? ఈ ప్రశ్నకు సమాధానం కోసం సగటు సినీ అభిమాని ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్నాడు. అటు రాజమౌళి గానీ, సినిమా యూనిట్ గానీ ఈ విషయాన్ని ధృవీకరించకపోయేసరికి ఆ సగటు అభిమాని ప్రశ్న ప్రశ్నలాగే మిగిలిపోయింది. ఈలోగా రిలీజ్ ఈరోజూ, ఆరోజంటూ రకరకాల వార్తలు షికారు చేస్తున్నాయి.
ఇక ఎట్టకేలకు బాహుబలి దర్శకుడైన రాజమౌళి నోరు విప్పారు. ట్విట్టర్ ద్వారా ఒక వీడియో పోస్ట్ చేసి బాహుబలి రిలీజ్ డేట్‌పై ఓ క్లారిటీ ఇచ్చారు. ఒక్క పాట మినహా సినిమా షూటింగ్ పూర్తైందనీ, మేం ముందే తెలిజేసినట్టుగానే.. మే 15నే బాహుబలి పార్ట్ 1 విడుదలవుతుందని తెలిపారు. ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్‌తో విజువల్ వండర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనుష్క, తమన్నాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. రానా ప్రతినాయక పాత్ర పోషిస్తున్నారు. ఎం. ఎం. కీరవాణి సంగీతం సమకూరుస్తుండగా, ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోబు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ నిర్మిస్తున్నారు.

