యంగ్ హీరో నాగశౌర్య ఆ మధ్య వచ్చిన ‘ఛలో’ చిత్రంతో మంచి విజయం సాధించారు. ఆ చిత్ర విజయం ఇచ్చిన ఉత్సాహంతో శౌర్య ఓన్ బ్యానర్ లోనే కాకుండా బయట సినిమాలు వరుసగా చేసుకుంటూ వెళ్తున్నాడు. నాగశౌర్య హీరోగా కొత్త దర్శకుడు రాజా కొలుసు దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఐతే ఈ చిత్ర టైటిల్ గురించి ఒక ఆసక్తికరమైన వార్త తెలిసింది. బాలయ్య సూపర్ హిట్స్ లో ‘నారి నారి నడుమ మురారి’ చిత్రం ముందు వరుసలో ఉంటుంది. ఇప్పుడు ఈ చిత్ర టైటిల్ నాగశౌర్య సినిమాకి పెట్టనున్నారని తెలుస్తోంది. ఈ చిత్రంలో నాగశౌర్యకి జోడిగా ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్నారు.
కాగా భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై వి.ఆనంద ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈయన గతంలో బాలకృష్ణతో ‘పైసా వసూల్’ చిత్రాన్ని నిర్మించారు. ఆ చనువుతోనే తన చిత్ర టైటిల్ పెట్టుకోవడానికి బాలయ్య అంగీకరించారని సినీ వర్గాల సమాచారం. మహతి స్వర సాగర్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రం ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్ళనుంది.


