సినిమా అంటే రెస్పాన్సిబిలిటీ. మంచి సందేశంతో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తారని నా నమ్మకం. అని అన్నారు హరినాథ్ పొలిచర్ల. సినిమాలపై మమకారంతో అమెరికా నుండి ఇండియా వచ్చిన ఈ ఎన్నారై గతంలో ‘చంద్రహాస్’, ‘హోప్’, ‘చాప్టర్ 6’ వంటి విభిన్నమైన సినిమాలను నిర్మించారు. తాజాగా ‘బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ఎవర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
పి.హెచ్.ప్రొడక్షన్స్ పతాకంపై హరినాథ్ పొలిచర్ల హీరోగా నటిస్తూ.. స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ఎవర్’ సినిమా లోగో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం నాడు హైదరాబాద్ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయిన శివశక్తి దత్తా లోగో, ట్రైలర్ విడుదల చేశారు.
అనంతరం హరినాథ్ మాట్లాడుతూ.. మంచి స్నేహితుడు ఎప్పుడు మన సంతోషాన్ని కోరుకుంటాడు. అనే కాన్సెప్ట్ తో సినిమా చేశాం. ఫ్రెండ్షిప్ నేపధ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో విశ్వరామ్, రెహాన్, సురభి సూర్యకుమార్, ఏంజలీనాలు ముఖ్య పాత్రలు పోషించారు. అందరూ అద్బుతమైన నటన కనబరిచారు. రాహుల్ రాజ్ సినిమాకు చక్కని సంగీతం అందించారు. త్వరలో ఫస్ట్ కాపీ రెడీ అవుతుంది. అని అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో దర్శకుడు సూర్య కిరణ్, చిత్ర బృందం సభ్యులు పాల్గొన్నారు.


