ఒక్క కరెక్ట్ సినిమా పడితే సుధీర్ స్టార్ అవుతాడు : మహేష్

ఒక్క కరెక్ట్ సినిమా పడితే సుధీర్ స్టార్ అవుతాడు : మహేష్

Published on Nov 25, 2015 11:11 PM IST

mahesh
సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కొత్తగా సినీ పరిశ్రమకు పరిచయమైన హీరో సుధీర్ బాబు. ఇండస్ట్రీకి వచ్చిన కొద్దికాలంలోనే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో, రీసెంట్‌గా వచ్చిన ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ సినిమాతో అటూ విమర్శకుల ప్రశంసలను, బాక్సాఫీస్ విజయాన్నీ సొంతం చేసుకున్నారు. ఇక ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టిన ఈ హీరో, ‘భలే మంచి రోజు’ అనే సినిమాను అప్పుడే విడుదలకు సిద్ధం చేసేశారు.

కొత్త దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను 70 ఎంఎం బ్యానర్‌పై విజయ్, శశి నిర్మించారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఆడియో ఆవిష్కరణ వేడుకను ఈ సాయంత్రం హైద్రాబాద్‌లోని శిల్పకళావేదికలో వైభవంగా నిర్వహించారు. సూపర్ స్టార్ మహేష్, రానా, సందీప్ కిషన్, ప్రముఖ నిర్మాత దిల్‌రాజు, నిర్మాత అనిల్ సుంకర తదితరులు అతిథులుగా హాజరైన ఈ వేడుకలో ఎమ్.ఆర్. సన్నీ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఆల్బమ్‌తో పాటు థియేట్రికల్ ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు.

ఇక ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ.. “సుధీర్ బాబు అంటే నాకు చాలా ఇష్టం. ఎప్పుడూ సినిమా కోసం కష్టపడుతూ, డెడికేషన్‌తో పనిచేస్తుంటాడు. కష్టపడే తత్వమున్న సుధీర్‌ను హీరోగా ఆదరిస్తున్నందుకు థ్యాంక్స్. భలే మంచి రోజు టీజర్ చూసినప్పుడే ఫ్రెష్‌గా కనిపించింది. ఇప్పుడు ఆడియో, ట్రైలర్ చూశాక మరింత కొత్తదనం కనిపించింది. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్యకు ఈ సందర్భంగా శుభాకాంక్షకు తెలియజేస్తున్నా. ప్రేక్షకులు కొత్తదనాన్ని బాగా ఆదరిస్తున్నారు. సుధీర్ బాబుకు ఒక్క సరైన హిట్ పడితే స్టార్ అవుతాడు. ఈ సినిమా అలాంటి హిట్ తెచ్చిపెడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా” అని తెలిపారు. ఇక ఇదే కార్యక్రమంలో పాల్గొన్న రానా, దిల్‌రాజు తదితరులు సినిమా మంచి విజయం సాధించాలని కాంక్షించారు.

తాజా వార్తలు