ఇంటర్వ్యూ : భీమినేని శ్రీనివాస్ – సినిమాలోని ప్రతి సన్నివేశం వినోదాన్ని పంచుతుంది.
Published on Sep 2, 2018 4:29 pm IST


 

భీమినేని శ్రీనివాస్ దర్శకత్వంలో సునీల్ మరియు నరేష్ కలిసి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సిల్లీ ఫెలోస్’. కామెడీ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 7 న విడుదల కాబోతుంది. ఈ సంధర్బంగా ఈ చిత్ర దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు మీ కోసం..

మీరు మళ్ళీ చాలా గ్యాప్ తరువాత తీసిన సినిమా ‘సిల్లీ ఫెలోస్’. ఈ సినిమా గురించి చెప్పండి ?

ఈ సినిమాలో ఒక ఇరవై క్యారెక్టర్స్ దాకా ఉంటాయి. అయితే సినిమాలోని ప్రతీ క్యారెక్టర్ నవ్విస్తుంది. ఒక మామూలు లేడీస్‌ టైలర్‌ గా పనిచేసే జయప్రకాష్‌ రెడ్డి పాత్ర రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా అవుతాడు. ఆయన్ని ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లో రావాలనుకున్నే ఓ కుర్రాడి పాత్రలో నరేష్‌ కనిపిస్తాడు. సినిమాలోని ప్రతి సన్నివేశం వినోదాన్ని పంచుతుంది.

ఈ సినిమాలో సునీల్ ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నారు ?

ఈ సినిమాతో సునీల్‌ మళ్లీ కమెడియన్‌ గా కనిపించబోతున్నాడు. హీరో చేసే కొన్ని పనుల కారణంగా సునీల్‌ ఓ సమస్యలో చిక్కుకుంటాడు. అందులోంచి బయటపడడానికి తను పడే పాట్లు చాలా ఆసక్తిగా ఉండటంతో పాటు బాగా నవ్విస్తాయి.

ఈ సినిమాకి టైటిల్ ‘సిల్లీ ఫెలోస్’ కంటే ‘సుడిగాడు 2’ అని పెట్టాలనుకున్నారట. మరెందుకు ఆ టైటిల్ పెట్టలేదు ?

‘సిల్లీ ఫెలోస్’ కంటే ముందు ‘సుడిగాడు 2’నే పెట్టాలనుకున్నాం. కానీ ఈ సినిమాలో స్పూఫ్‌ సీన్స్ లాంటివి ఏమి ఉండవు. ‘సుడిగాడు 2’ టైటిల్ ఈ కథకు కరెక్ట్ కాదనిపించింది. అందుకే సుమారు రెండు వందల పేర్ల వరకూ పరిశీలించి… చివరకు ‘సిల్లీ ఫెలోస్‌’ అని పెట్టాం.

ఈ మధ్య నరేష్ కి పెద్దగా విజయాలు ఏమి లేవు. మరి నరేష్ తోనే ఈ సినిమా ఎందుకు తీయాలనుకున్నారు ?

‘సుడిగాడు’ తరవాత నరేష్‌ కే కాదు, నాకు కూడా సరైన విజయాలు లేవు. ఇద్దరి పరిస్థితీ ఇంచు మించు అంతే. అయితే ఈ సినిమా మా ఇద్దరికీ ఓ విజయాన్ని అందిస్తుందని నమ్ముతున్నా. ఎందుకంటే ఈ సినిమాలో కథలోనే కామెడీ పుడుతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ లకు చాలా మంచి స్పందన వచ్చింది.

నరేష్ మీరు కలిసి చేసిన ‘సుడిగాడు’ మంచి విజయం సాధించింది. దాంతో ఆ చిత్రానికి సీక్వెల్ చేస్తారని అప్పట్లో బాగా వినిపించింది. మరి చెయ్యకపోవటానికి కారణం ఏమిటి ?

‘జబర్దస్త్‌ లాంటి టీవీ షోస్ వల్ల కామెడీ అందరికి చేరువలో ఉంది. దాంతో స్పూఫ్‌ల ద్వారా నవ్వించడం ఇప్పుడు చాలా కష్టం అయిపోయింది. అందుకే స్పూఫ్‌ లు పెట్టి సినిమా తియ్యటం కరెక్ట్ కాదు అనిపించింది. ప్రస్తుతం ప్రతీ సినిమా ఓ ఛాలెంజే. కొత్తగా లేకపోతే తిప్పికొడుతున్నారు. అందుకే అన్నిజాగ్రత్తలు తీసుకోని ఈ సినిమా తీశాము. ఖచ్చితంగా అందర్నీ అలరిస్తోంది.

  • 40
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook