సమీక్ష : బ్ల‌ఫ్ మాస్ట‌ర్‌- ఇంట్రస్ట్ గా సాగే బ్లఫ్ డ్రామా !

Published on Dec 29, 2018 2:45 am IST
Bluff Master movie review

విడుదల తేదీ : డిసెంబర్ 28, 2018

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు : సత్యదేవ్, నందిత శ్వేత్ తదితరులు.

దర్శకత్వం : గోపీ గణేష్ పట్టాభి

నిర్మాత : రమేష్, పి.పిళ్ళై

సంగీతం : సునీల్ కశ్యప్

సినిమాటోగ్రఫర్ : దాశరధి శివేంద్ర

ఎడిటర్ : నవీన్ నూలి

‘గోపీ గణేష్ పట్టాభి దర్శకత్వంలో సత్యదేవ్ కథానాయకుడిగా, నందిత శ్వేత కథానాయకిగా వచ్చిన చిత్రం ‘బ్లఫ్ మాస్టర్’. సునీల్ కశ్యప్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ఈ రోజే విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

కథ :

మనీ ఈజ్ ఆల్‌వేజ్ అల్టిమేట్ అని బలంగా నమ్మే ఉత్తమ్ కుమార్ (సత్య దేవ్) తన తెలివితేటలతో రక రకాలుగా గెటప్ లు మరియు పేర్లు మార్చుకొని జనాన్ని మోసం చేస్తూ డబ్బులు సంపాదిస్తుంటాడు. ఈ క్రమంలో ఆవని (నందిత శ్వేతా) జాబు కోసం సత్యదేవ్ దగ్గర జాయిన్ అవుతుంది. సత్యదేవ్ ఆవనిను కూడా వాడుకొని జనాన్ని మోసం చేస్తాడు. కానీ తన చేతిలో మోసపోయినవాళ్ళలో కొందరు(విలన్స్) సత్య దేవ్ మీద పగ బట్టి అతన్ని కిడ్నాప్ చేస్తారు. వాళ్ళ నుండి బయట పడే క్రమంలో వాళ్లకు మోసం చేసి సంపాదించిన డబ్బులు కట్టాలసి వస్తోంది. కానీ డబ్బులు కోసం సత్యదేవ్ ఫ్రెండ్స్ సత్యదేవ్ ని మోసం చేసి డబ్బు మొత్తం తీసుకోని వెళ్ళిపోతారు.

ఇక సత్య దేవ్ విలన్స్ నుండి తప్పించుకోవటానికి ఏం చేశాడు ? ఎలాంటి పరిస్థితులను ఎదురుకున్నాడు ? ఈ క్రమంలో అతని జీవితంలోకి అవని మళ్ళీ ఎలా వస్తోంది ? చివరికి విలన్స్ నుండి సత్యదేవ్ బయట పడ్డాడా.. ? లేదా ? లాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

మనీ ఈజ్ ఆల్‌వేజ్ అల్టిమేట్ అని నమ్మే ‘బ్లఫ్ మాస్టర్’గా కనిపించిన సత్యదేవ్ చక్కని నటనను కనబరిచాడు. హీరోయిన్ తో సాగే ప్రేమ సన్నివేశాల్లో కూడా సత్యదేవ్ తన నటనతో ఆకట్టుకుంటాడు. ముఖ్యంగా ఎంజాయ్‌ చేస్తూ తిరగడం కోసం మోసం చేసైనా డబ్బు సంపాదించాలనుకునే వ్యక్తిగా.. డబ్బే ముఖ్యమనుకునే పాత్రలో చివరకి డబ్బు కంటే ప్రేమే గొప్పది అని తెలుసుకున్నే సన్నివేశాల్లో సత్య దేవ్ పరిణతి చెందిన తన నటనతో ఆకట్టుకుంటూ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు.

ఇక ఈ సినిమాలో అవని అనే అమ్మాయి పాత్రలో నటించిన హీరోయిన్ నందిత శ్వేత ఎప్పటిలాగే తన నటనతో పాటుగా తన స్క్రీన్ ప్రెజెన్స్ తోనూ మెప్పించే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా ప్రేమ సన్నివేశాల్లో ఆమె చాలా బాగా నటించింది. డబ్బు కంటే ప్రేమ గొప్పది అని నమ్మే ఆవని పాత్రను నందిత చాలా బాగా పోషించింది.

ఇక ధనశెట్టి అనే కామిక్ పాత్రలో నటించిన పృథ్వి తన కామెడీ టైమింగ్ తో నవ్వించే ప్రయత్నం చేశాడు. అలాగే పృథ్వి, సత్యదేవ్ మధ్య సాగే సన్నివేశాలు కూడా ప్రేక్షకులకు అక్కడక్కడ మంచి వినోదాన్ని పంచుతాయి. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు.

 

మైనస్ పాయింట్స్ :

కథను బాగానే తయారుచేసుకున్న దర్శకుడు కథనాన్ని మాత్రం పూర్తి ఆసక్తికరంగా మలచలేకపోయారు. కీలకమైన సన్నివేశాలను బాగా రాసుకున్నప్పటికీ.. మిగిలిన సన్నివేశాల్లో కొన్నిటిని మాత్రం ఆసక్తికరంగా మలచలేకపోయారు.

సినిమా చూస్తున్నంతసేపు తర్వాత ఏం జరుగుతుంది, సెకెండాఫ్ లో హీరో మళ్ళీ ఎలాంటి కష్టాల్లో పడతాడో ? అనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో ఇంకా పెంచే అవకాశం ఉన్నప్పటికీ దర్శకుడు ఆ దిశగా సినిమాని నడపలేదు.

ఇక సినిమా ఫస్టాఫ్ కథనం సరదాగా గడిచిపోయినా ఇంటర్వెల్ తర్వాత సన్నివేశాలు నెమ్మదిగానే సాగుతూ బోర్ కొడతాయి.

 

సాంకేతిక విభాగం :

దర్శకుడు గోపి గణేష్ మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు. అయితే ఆ కాన్సెప్ట్ కి తగ్గట్లు పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథనాన్ని రాసుకోలేదు. రాసుకోకపోయినా, సినిమాలోని కీలక సన్నివేశాలతో ఆయన సినిమాని ఆసక్తికరంగా మలిచే ప్రయత్నం చేశారు. ఇక సినిమాలో సినిమాటోగ్రఫీ బాగుంది. దృశ్యాలన్నీ కెమెరామెన్ చాలా అందంగా చూపించారు.

సంగీత దర్శకుడు సునీల్ కశ్యప్ అందించిన పాటలు పర్వాలేదనిపస్తాయి. సెకండాఫ్ లో కొన్ని కీలక సన్నివేశాల్లో ఆయన అందించిన నేపధ్య సంగీతం మాత్రం కొంతమేరకు ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ సినిమాకి తగ్గట్లే ఉంది. సినిమాలోని నిర్మాత పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

 

తీర్పు :

గోపీ గణేష్ పట్టాభి దర్శకత్వంలో సత్యదేవ్ , నందిత శ్వేత హీరోహీరోయిన్లుగా వచ్చిన ఈ చిత్రం
కొన్ని సన్నివేశాల్లో తప్ప మరియు సెకెండ్ హాఫ్ లో కొంత భాగం తప్ప మిగతా సినిమా మొత్తం ఆసక్తికరంగా సాగుతూ ఆకట్టుకుంటుంది. ముందుగానే చెప్పుకున్నట్లు దర్శకుడు మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు. ఆ లైన్ కి చక్కని ట్రీట్మెంట్ తో పాటు మంచి కామెడీ సీన్స్ తో బాగా ఎంటర్ టైన్ చేశారు.

అయితే.. దర్శకుడు సినిమాని చాలా చోట్ల ఎంటర్ టైన్ గా నడిపినప్పటికీ, లవ్ స్టోరీని మాత్రం ఆ స్థాయిలో మలచలేకపోయారు. మెయిన్ గా హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సీన్స్ విషయంలో ఇంకొంచెం శ్రద్ద తీసుకుని ఉండి ఉంటే బాగుండేది. దీంతో పాటు కొన్ని సన్నివేశాల్లో నాటకీయత కూడా ఎక్కువుగా కనిపిస్తోంది. మొత్తం మీద ఏ సెంటర్ ప్రేక్షకులకు ఈ చిత్రం నచ్చుతుంది. అయితే మిగిలిన అన్నివర్గాల ప్రేక్షకులని ఎంతవరకు అలరిస్తుందో చూడాలి.

 

123telugu.com Rating : 3/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం :