సమీక్ష : ‘బొట్టు’ – ‘బొట్టు’లో అంత పట్టు లేదు !

Published on Mar 8, 2019 4:10 pm IST

విడుదల తేదీ : మార్చి 08, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : భ‌ర‌త్‌, న‌మిత, ఇనియా, ఊర్వ‌శి, ష‌కీలా

దర్శకత్వం : వి.సి.వ‌డివుడ‌యాన్

నిర్మాత : జి.కుమార్ బాబు

సంగీతం : అమ్రీష్‌

సినిమాటోగ్రఫర్ :ఎనియాన్ జె. హ్యారీస్‌

ఎడిటర్ : ఎలీనా

‘ప్రేమిస్తే’ ఫేమ్ భ‌ర‌త్‌, న‌మిత, ఇనియా, ఊర్వ‌శి, ష‌కీలా ప్ర‌ధాన తారాగ‌ణంగా వి.సి.వ‌డివుడ‌యాన్ ద‌ర్శ‌క‌త్వంలో తెలుగు, త‌మిళ భాష‌ల్లో రూపొందిన చిత్రం ‘బొట్టు’. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :

అర్జున్ (భరత్ ) మెడికల్ స్టూడెంట్. కాపీ కొట్టి పాస్ అవాలని ప్రయత్నించే క్రమంలో కాలేజీ యాజమాన్యానికి దొరికిపోతాడు. ఆ తరువాత జరిగిన కొన్ని నాటకీయ సంఘటనల కారణంగా, అతని శరీరంలోకి బొట్టు (ఇనియా) అనే దెయ్యం ప్రవేశిస్తోంది. ఆ తరువాత బొట్టు ప్రభావంతో అర్జున్ ఎలా మారిపోతాడు ? అసలు బొట్టు, అర్జున్ శరీరంలోకే ఎందుకు ప్రవేశిస్తోంది ? ప్రవేశించి ఎవర్ని చంపాలనుకుంటుంది ? అయినా బొట్టుకి ఆ మెడికల్ కాలేజీకి ఏమిటి సంబంధం ? ఇంతకీ బొట్టు కథ ఏమిటి ? బొట్టు కోరిక ఏమిటి ? ఆ కోరిక కారణంగా అర్జున్ జీవితంలో చోటు చేసుకున్న పరిస్థితులు ఏమిటి ? అర్జున్ కు ఎదురైన ఇబ్బందులు ఏమిటి ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

దర్శకుడు వి.సి.వ‌డివుడ‌యాన్ మంచి కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ‘బొట్టు’ తాలూకు కథ చాలా బాగా ఆకట్టుకుంటుంది. అలాగే బొట్టు పాత్ర.. ఆ పాత్రకు సంబంధించిన ట్రాక్.. అలాగే ఆ పాత్రతో ముడి పడిన ఆమె గూడెంకి సంబంధించిన మిగిలిన పాత్రలు.. ఆ పాత్రలు మోసపోయిన విధానం.. మొత్తానికి పగతో రగిలిపోయే వాళ్ళ ఆత్మల ఘోష తాలూకు పెయిన్.. వంటి అంశాలు సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన భరత్ తన పాత్రకు తగ్గట్లు… తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకుంటూ సినిమాకే హైలెట్ గా నిలిచాడు. కొన్ని కీలక సన్నివేశాలతో పాటు క్లైమాక్స్ సన్నివేశంలో కూడా భరత్ నటన చాలా బాగుంది. సినిమాలో సగభాగం పైగా వచ్చే గ్రాఫిక్స్ మాయాజాలం ఈ చిత్రానికి హైలెట్ గా నిలుస్తుంది.

ఇక హీరోయిన్ గా నటించిన సృష్టి టాంగే హీరోయిన్ మెటీరియల్ కాకపోయినా.. నటన పరంగా ఆమె పాత్ర పరిధి మేరకు బాగానే నటించింది. సినిమాలో కీలకమైన బొట్టు అనే ఓ గిరిజ‌న యువ‌తిగా నటించిన ఇనియా కొన్ని ఎమోషనల్ సీన్స్ లో అవలీలగా నటించడంతో పాటు అందంగా కనిపిస్తూ మెప్పిస్తోంది. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

మైనస్ పాయింట్స్ :

దర్శకుడు వి.సి.వ‌డివుడ‌యాన్ రాసుకున్న కాన్సెప్ట్.. అలాగే ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు బాగున్నప్పటికీ.. కథ కథనాల్లో మాత్రం ప్లో మిస్ అయింది. ముఖ్యంగా ఆయన రాసుకున్న కథనం ఆకట్టుకొన్నే విధంగా లేదు. దీనికి తోడు అనవసరమైన కామెడీ ట్రాక్స్ పెట్టి.. ప్రేక్షకుడికి సినిమా పై కలిగే ఆసక్తిని నీరుగారుస్తారు. పైగా సెకెండ్ హాఫ్ లో మొదటి సగభాగం బాగా స్లోగా సాగుతూ బోర్ కొట్టిస్తోంది.

మొత్తానికి దర్శకుడు సినిమాలోని ఇంట్రస్టింగ్ ఎలెమెంట్స్ ను పక్కన పెట్టి.. పండని కామెడీ సీన్స్ తో కథను డైవర్ట్ చేశారనిపిస్తోంది. అలాగే కథకు అవసరం లేని అనవసరమైన సన్నివేశాలు కూడా ఎక్కువైపోయాయి. పైగా ఆ సీన్స్ అన్ని కూడా.. ఒకేలా సాగడం కూడా విసుగు తెప్పిస్తోంది.

అన్నిటికి మించి. ఓ దెయ్యం తన కోరిక నెరవేర్చుకునే క్రమంలో.. హీరో ఏం అయిపోతాడో.. ఎలాంటి ఇబ్బందులకు గురవుతాడో.. అనే ఒక పెయిన్ ఫుల్ కంటెంట్ అండ్ టెన్షన్ ఎలివేట్ చేసే అవకాశం ఉన్నా… దర్శకుడు మాత్రం ఆ కంటెంట్ ను పూర్తిగా వాడుకోలేదు. దర్శకుడు సెకండాఫ్ పై బాగా శ్రద్ధ పెట్టి ఉంటే సినిమాకి చాలా ప్లస్ అయి ఉండేది.

సాంకేతిక విభాగం :

ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. సంగీత దర్శకుడు అమ్రీష్‌ అందించిన నేపధ్య సంగీతం పర్వాలేదనిపిస్తోంది. ముఖ్యంగా హీరో హీరోయిన్ ల మధ్య సాగే మొదటి పాట… మరియు ప్లాష్ బ్యాక్ లో వచ్చే ‘బొట్టు’ సాంగ్ అలరిస్తాయి. ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి తగ్గట్లే సాగుతుంది.

ఇక ఎడిటింగ్ బాగుంది గాని, సెకండాఫ్ ను ఇంకా టైట్ గా ట్రీమ్ చేసి ఉంటే, సినిమాకి ప్లస్ అయ్యేది. ఎనియాన్ జె. హ్యారీస్‌ సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకున్నేలా ఉంది. హర్రర్ సన్నివేశాల్లోని విజువల్స్ ను ఆయన చాలా సహజంగా చూపించారు. ఇక నిర్మాత పాటించిన నిర్మాణ విలువలు సినిమాకి తగ్గట్లే ఉన్నాయి.

తీర్పు :

‘ప్రేమిస్తే’ ఫేమ్ భరత్ హీరోగా వి.సి.వ‌డివుడ‌యాన్ దర్శకుడిగా హర్రర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ హర్రర్ కామెడీ ఎంటర్టైనర్ పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా సాగలేదు. సినిమా కాన్సెప్ట్.. అలాగే ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు బాగున్నప్పటికీ…. కథ కథనాల్లో ప్లో మిస్ అవ్వడం, అనవసరమైన కామెడీ ట్రాక్స్ పెట్టి ప్రేక్షకుడికి సినిమా పై కలిగే ఆసక్తిని చంపేయడం, సెకెండ్ హాఫ్ లో మొదటి సగభాగం బాగా స్లోగా సాగడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. అయితే సినిమాలోని కొన్ని ఎలిమెంట్స్ బి.సి ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చు. మరి.. కనీస స్థాయిలో కూడా బజ్ లేని ఈ ‘బొట్టు’ బాక్సాఫీస్ వద్ద ఎంత వరకు నిలబడుతుందో చూడాలి.

123telugu.com Rating : 2.5/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం :

More