ధురంధర్ 2 రిలీజ్: పార్ట్ 1 స్టోరీ రీక్యాప్.. థియేటర్‌కు వెళ్లే ముందు ఈ ట్విస్టులు గుర్తుతెచ్చుకోండి!

ధురంధర్ 2 రిలీజ్: పార్ట్ 1 స్టోరీ రీక్యాప్.. థియేటర్‌కు వెళ్లే ముందు ఈ ట్విస్టులు గుర్తుతెచ్చుకోండి!

Published on Mar 18, 2026 5:00 PM IST

Dhurandhar 2

రేపే థియేటర్లలో ‘ధురంధర్: ది రివెంజ్’ (Dhurandhar: The Revenge) భారీ అంచనాల మధ్య రిలీజ్ కాబోతోంది. అసలైన యాక్షన్ చూడటానికి ముందు, పార్ట్ 1లో జరిగిన మైండ్ బ్లోయింగ్ పరిణామాలను ఒక్కసారి గుర్తుచేసుకుందాం. తీవ్రవాదులు నుంచి భారత దేశానికి పొంచి ఉన్న ఒక అతిపెద్ద ముప్పును అడ్డుకోవడానికి ఇండియన్ ఇంటెలిజెన్స్ వేసిన పక్కా ప్లాన్ ‘ఆపరేషన్ ధురంధర్’. విమాన హైజాక్‌తో వెలుగులోకి వచ్చిన ఒక టెర్రరిస్ట్ సిండికేట్‌ను మట్టుబెట్టడానికి, శత్రువుల స్థావరంలోకి మనవాడిని పంపడంతో ఈ కథ మొదలవుతుంది.

లయారీ మాఫియా.. హమ్జా ఎంట్రీ

పాకిస్థాన్‌లోని లయారీ (Lyari) వీధుల్లోకి హమ్జా ఎంట్రీ ఇస్తాడు. ఒక ప్రమాదం నుంచి మాఫియా డాన్ కొడుకును కాపాడి, ఆ గ్యాంగ్‌లో అత్యంత నమ్మకస్తుడిగా మారతాడు. అయితే, ఊహించని విధంగా తన కొడుకును కోల్పోయిన రెహ్మాన్ డకాయిట్ (Rehman Dakait) ప్రతీకారంతో రగిలిపోతాడు. ఆ కసితో ప్రత్యర్థి గ్యాంగ్‌ను సర్వనాశనం చేసి లయారీ మొత్తానికి తిరుగులేని రారాజుగా అవతరిస్తాడు.

మరోవైపు, ప్రముఖ రాజకీయ నాయకుడి కూతురు యలినా (Yalina)తో హమ్జా ప్రేమలో పడతాడు. కానీ లయారీ లాంటి ప్రాంతంలో ప్రేమ అనేది చాలా క్లిష్టమైన పని. వాస్తవానికి హమ్జా అక్కడ ఆడుతోంది చాలా డేంజరస్ గేమ్. రాజకీయ నాయకులు తమ కుర్చీని కాపాడుకోవడానికి ఎంతటి దారుణాలకైనా ఒడిగడతారు అనడానికి జమీల్ జమాలి క్యారెక్టర్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. తన పదవిని కాపాడుకోవడానికి సస్పెండ్ అయిన ఒక పోలీస్ ఆఫీసర్‌ ఎస్ పి చౌదరి అస్లాంని రంగంలోకి దించుతాడు జమీల్. రెహ్మాన్ సామ్రాజ్యాన్ని కూల్చడమే అతని ప్రధాన టార్గెట్.

సరిగ్గా ఇదే సమయంలో ఒక దుర్మార్గపు మేజర్ జాతీయవాదం ముసుగులో 26/11 దాడులకు ప్లాన్ చేస్తాడు. ఈ పరిణామంతో హమ్జా మిషన్ మరింత క్లిష్టంగా మారుతుంది.

మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. అసలు వేట మొదలు

రెహ్మాన్‌ను గద్దె దించడానికి శత్రువులు ఒక్కటవుతారు. హమ్జా, ఆ పొలిటీషియన్, మరియు పోలీస్ ఆఫీసర్ ముగ్గురూ చేతులు కలుపుతారు. వాళ్లు పన్నిన ఉచ్చులో రెహ్మాన్ సామ్రాజ్యం కుప్పకూలుతుంది. ఇక్కడే ప్రేక్షకులకు ఎవరూ ఊహించని ఒక భారీ ట్విస్ట్ ఎదురవుతుంది. అప్పటివరకు మాఫియాలో కీలక సభ్యుడిగా ఉన్న హమ్జా.. వాస్తవానికి ఒక ఇండియన్ స్పై! అతని అసలు పేరు ‘జస్కిరత్ సింగ్ రంగి’ గా రివీల్ అవుతుంది.

లయారీ ఎపిసోడ్ కేవలం ఒక ఆరంభం మాత్రమే అని దర్శకుడు క్లారిటీ ఇచ్చారు. అసలైన మాస్టర్ మైండ్‌ను వేటాడటం ఇకపైనే మొదలవుతుందని పార్ట్ 1 ఎండ్ కార్డ్ పడుతుంది. జస్కిరత్ తన తదుపరి మిషన్‌ను ఎలా పూర్తి చేస్తాడనేది రేపు రిలీజ్ కాబోతున్న ‘ధురంధర్: ది రివెంజ్’లో చూడాలి. మరి, ఈ యాక్షన్ ప్యాక్డ్ సీక్వెల్ కోసం మీ టికెట్స్ బుక్ చేసుకున్నారా?

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు