
‘సింహా’, ‘లెజెండ్’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ బోయపాటి శ్రీను. ఈ సినిమా విజయాలతో బోయపాటి శ్రీనుకి నందమూరి అభిమానుల నుంచే కాకుండా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో కూడా మంచి ఫాలోయింగ్ వచ్చింది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే ఈ ఫాలోయింగ్ తోనే ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబు నాయుడు బోయపటికి ఓ పనిని అప్పగించారు. అది కూడా గోదావరి పుష్కరాల గురించి, ఆ పనిని బోయపాటి పర్ఫెక్ట్ గా చేసి చూపడంతో చంద్రబాబు నాయుడు చాలా హ్యాపీగా ఉన్నారు.. ఇక అసలు విషయంలోకి వెళ్దాం..
గత నాలుగు రోజులుగా గోదావరి పుష్కరాలు జరుగుతున్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే.. వారణాశిలో పుష్కరాల టైంలో చేసే గంగా హారతి స్థాయిలోనే మన రాజమండ్రి గోదావరి పుష్కరాల వద్ద కూడా గోదావరి నిత్య హారతి నిర్వహించాలని ఏపి ప్రభుత్వం అనుకుంది. కానీ రోజు నిర్వహించే నిత్య హారతి మొదట్లో ప్రజల మన్ననలు పొందకపోవడంతో చంద్రబాబునాయుడు ఈ పనిని బోయపాటికి అప్పగించి ‘నాకో, మరెవరికో కాదు యావత్ భక్త కోటికి సంతృప్తినిచ్చేలా గుర్తుండి పోవాలని’ చెప్పాడు.
దాంతో బోయపాటి ప్రజలందరికీ కనువిందు చేయడమే కాకుండా వినసొంపైన రీతిలో నిత్య హారతి ఉండాలని ఆలోచించి అక్కడి ప్రదేశాలన్నిటినీ పరిశీలించి రాజమండ్రి రెండు వంతెనల నడుమ ఉన్న ఫంటు మీద ఒక వేదికని నిర్వహించారు. బోయపాటి శ్రీను గుంటూరుకు చెందిన సినీ ఆర్ట్ విభాగంతో కలిసి నిత్య హారతి వేదికని ఏర్పాటు చేయడమే కాకుండా సౌండ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. దాంతో ఈనెల 13 నుంచి గోదావరి తీరంలో అంగరంగ వైభవంగా గంగా నిత్య హారతి జరుగుతోంది. ఈ నిత్య హారతి విషయంలో భక్తులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. సినిమాల్లోనే కాదు ఇలాంటి విషయాల్లో కూడా బోయపాటి శ్రీను మరోసారి తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకున్నాడు.

