
ఇటివల కాలంలో అతి తక్కువ నిర్మాణ వ్యయంతో రూపొందిన కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు టాలీవుడ్ లో మంచి విజయాలను సొంతం చేసుకుంటున్నాయి. ‘ప్రేమ కథా చిత్రమ్’, ‘గీతాంజలి’ వంటి హారర్ కామెడీ సినిమాలు ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకున్నాయి. అదే కోవలో వస్తున్న మరో సినిమా ‘బూచమ్మ బూచోడు’. శివాజీ, కైనాజ్ మోతివాలా జంటగా నటించిన ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు రేవన్ యాదు. సెప్టెంబర్ 5న విడుదలవుతున్న ఈ సినిమా విశేషాలను తెలియజేయడానికి మీడియాతో సమావేశం అయ్యారు. రేవన్ యాదు చెప్పిన విశేషాలు మీకోసం..
ప్రశ్న) తెలుగు సినిమా ఇండస్ట్రీలో మీ ప్రయాణం గురించి చెప్పండి..?
స) అసిస్టెంట్ రైటర్ గా పోసాని కృష్ణమురళి వద్ద కొన్ని రోజులు వర్క్ చేశాను. తర్వాత గుణశేఖర్ వద్ద ‘సొగసు చూడతరమా’ నుండి ‘నిప్పు’ సినిమా వరకు దర్శకత్వ శాఖలో పనిచేశాను. దర్శకుడిగా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో శివాజీ లోబడ్జెట్లో మంచి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ స్టొరీ ఉంటె చెప్పు చేద్దాం అన్నారు. సాయి కృష్ణ అనే రచయితతో కలసి హారర్ కామెడీ జోనర్లో ‘బూచమ్మ బూచోడు’ కథ రెడీ చేశాం.
ప్రశ్న) హారర్ కామెడీ జోనర్లో ఇటివల కాలంలో చాలా సినిమాలు వచ్చాయి. వాటికి, ‘బూచమ్మ బూచోడు’కి మధ్య డిఫరెన్స్ ఏంటి..?
స) ‘బూచమ్మ బూచోడు’తో ప్రేక్షకులకు మెసేజ్ ఇవ్వడానికి ప్రయత్నించాం. ఐటి రంగంలో భార్యాభర్తలిద్దరూ సమానంగా సంపాదిస్తున్నారు. ఎవరు ఎక్కువ అనే ఇగో ప్రొబ్లెమ్స్ మొదలవుతున్నాయి. చిన్న చిన్న సమస్యలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వారికి మా సినిమాలో పరిష్కారం చూపించాం. హారర్ కామెడీ జోనర్’లో తెరకెక్కిన ఫ్యామిలీ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా ఇది.
ప్రశ్న) హీరో శివాజీ నటన గురించి చెప్పండి..?
స) ఒక నటుడిగా శివాజీ తనను ప్రూవ్ చేసుకున్నాడు. పలు సినిమాలలో అతని నటనకు మంచి పేరొచ్చింది. నా కథకు 100% న్యాయం చేశారు. చాలా బాగా నటించారు. ప్రొడక్షన్ వ్యవహారాలను దగ్గరుండి చూసుకునేవారు. హీరోయిన్ కైనాజ్ మోతివాలా అద్బుతంగా నటించింది. ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
ప్రశ్న) సినిమాలో హైలైట్స్ ఏంటి..?
స) లోబడ్జెట్ సినిమాలలో విజువల్ పరంగా ‘బూచమ్మ బూచోడు’ ది బెస్ట్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. హీరో హీరోయిన్ల నటన, శేఖర్ చంద్ర సంగీతం సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి. ముఖ్యంగా జబర్దస్త్ రియాలిటీ కామెడీ షో ఆర్టిస్టులు చేసిన సన్నివేశాలు ప్రేక్షకులకు కావాల్సినంత వినోదం అందిస్తాయి. సినిమాలో హారర్, కామెడీ, రొమాన్స్ ఇలా ప్రేక్షకులు ఆశించే ప్రతి అంశం సినిమాలో ఉంటుంది. సెప్టెంబర్ 5న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మంచి విజయం సొంతం చేసుకుంటుందని ఆశిస్తున్నాను అంటూ ఇంటర్వ్యూను ముగించారు.

