దర్శకధీరుడు రాజమౌళి, సూపర్‌స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో రూపొందుతున్న గ్లోబల్ ప్రాజెక్ట్ ‘వారణాసి’ గురించి నిత్యం ఏదో ఒక క్రేజీ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. తాజాగా ఈ సినిమా ప్లాట్‌కు సంబంధించి ఒక ఆసక్తికరమైన లీక్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఈ కథ వారణాసి అనే ఆధ్యాత్మిక నగరం నేపథ్యంలో ప్రారంభమవుతుందని, అక్కడే హీరోకు అత్యంత సన్నిహితుల నుంచి ఊహించని రీతిలో ‘వెన్నుపోటు’ ఎదురవుతుందని సమాచారం. రాజమౌళి గత చిత్రాల్లోని కట్టప్ప ద్రోహం, ఛత్రపతిలో తమ్ముడి మోసం వంటి ఎమోషన్స్ ఎంతలా వర్కవుట్ అయ్యాయో మనకు తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రంలో కూడా అదే స్థాయి ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్‌ను రాజమౌళి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ కథ కేవలం వారణాసికి మాత్రమే పరిమితం కాకుండా, అక్కడి నుండి అంతర్జాతీయ స్థాయి అడ్వెంచర్‌గా మారుతుందని సమాచారం. ఆఫ్రికన్ అడవుల్లో సాగే సాహసయాత్రకు, వారణాసిలో జరిగిన ద్రోహానికి మధ్య రాజమౌళి ఒక అద్భుతమైన లింక్ సెట్ చేసినట్లు టాక్. ఇందులో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. ఆయన పాత్ర మహేష్‌కు స్నేహితుడిగా ఉంటూనే శత్రువుగా మారుతుందా, లేక ఈ వెన్నుపోటు వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్ ఆయనేనా అనే కోణంలో అభిమానులు విశ్లేషణలు మొదలుపెట్టారు. ద్రోహానికి గురైన ఒక వ్యక్తి, తన లక్ష్యం కోసం ఏ స్థాయి సాహసానికైనా ఎలా వెళ్తాడు అనేది ఈ సినిమా ప్రధాన ఇతివృత్తం కానుంది.
రాజమౌళి విజన్, మహేష్ బాబు ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ తోడైతే వెండితెరపై ఒక ఎమోషనల్ వండర్ క్రియేట్ అవ్వడం ఖాయం. ఒక సామాన్యుడు సాహసిగా మారి తనను మోసం చేసిన వారిపై ఎలా విజయం సాధించాడనే అంశాలను రాజమౌళి తనదైన శైలిలో చూపించబోతున్నారట. అయితే ఇవన్నీ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఊహాగానాలు మాత్రమే. ఈ ప్రచారంలో ఎంతవరకు నిజముందనేది చిత్ర యూనిట్ అధికారికంగా స్పష్టత ఇచ్చే వరకు వేచి చూడాలి.


