సినీ పరిశ్రమలో టాలెంట్ కంటే సక్సెస్ కే ఛాన్స్ లు ఎక్కువ వస్తాయని మళ్లీ మరోసారి రుజువు అయింది. ‘కార్తికేయ’ సినిమాతో మంచి హిట్ కొట్టాడు దర్శకుడు చందు మొండేటి. ‘కార్తికేయ’ తర్వాత చందు మొండేటితో సినిమా చెయ్యడానికి కొంతమంది నిర్మాతలు చాలా ఆసక్తి చూపించడంతో అప్పట్లో చందుకు చాలా డిమాండ్ ఏర్పడింది. అలాగే తమతో సినిమా చెయ్యమని కొంతమంది హీరోలూ.. ఆఫర్ చేశారు. ఆలా చేసిందే ‘సవ్యసాచి’ సినిమా.
నవంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫిస్ వద్ద అపజయాన్ని మూట్టకట్టుకుంది. దాంతో చందు మొండేటి నాగార్జునతో అనుకున్న ప్రాజెక్ట్ కూడా ఆగిపోయింది. అలాగే ‘శర్వానంద్’తోనూ అప్పట్లో ఓ సినిమా చేద్దామనుకున్నారు. కానీ శర్వానంద్ కూడా ప్రస్తుతం తన డేట్లు ఖాళీ లేవు అని చెప్పేశాడట.
ఇక చేసేది ఏమిలేక చందు తన తరువాత సినిమాను నిఖిల్ తో చేయడానికి స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నాడు. ‘కార్తికేయ’ తీసి తనకు మంచి డిమాండ్ ను తెచ్చుకున్న చందు.. మళ్ళీ నిఖిల్ తో ‘కార్తికేయ 2’ తీసి… తిరిగి మళ్ళీ ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి. ఇక ఈ సినిమాను నిర్మాత చెరుకూరి సుధాకర్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది.


