సురేందర్ రెడ్డి మీదున్న నమ్మకంతోనే 151వ సినిమా అప్పగించామన్న చరణ్ !


మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నెం 150’ తో పరిశ్రమలోని పలు రికార్డుల్ని బద్దలుకొట్టి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఘన విజయం సాధించడంతో మరోసారి ఇండస్ట్రీలో చిరంజీవి శకం మొదలైనట్టయింది. ఇక మెగా అభిమానులంతా ఖైదీ లాంటి భారీ హిట్ తర్వాత చిరు ఎలాంటి సినిమా చేస్తారు, ఏ దర్శకుడితో చేస్తారో చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో చరణ్ నాన్నగారి 151వ సినిమాని సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తాడని అనౌన్స్ చేశారు.

అది విన్న చాలా మంది కాస్త ఆశ్చర్యానికి గురయ్యారు. కానీ చరణ్ మాత్రం సురేందర్ రెడ్డికి సినిమా అప్పగించడంతో చాలా క్లారిటీగా ఉన్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన సురేందర్ అయితే నాన్నగారిని అభిమానులకు కావాల్సిన విధంగా చాలా స్టైలిస్ట్ గా ప్రొజెక్ట్ చేస్తాడు. నాన్నగారు కూడా అదే ఫీలై సినిమా అతనికివ్వడానికి ఒప్పుకున్నారు. మాకు అతని మీద చాలా నమ్మకం ఉంది అన్నారు. స్టైలిష్ డైరెక్టర్ గా పేరున్న సురేందర్ రెడ్డి చరణ్ కు ‘ధృవ’ వంటి కమర్షియల్ హిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇకపోతే ప్రస్తుతం చిరు 151వ సినిమా ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ స్క్రిప్ట్ పనులు వేగంగా జరుగుతున్నాయి.