నటనలో దేశవ్యాప్తంగా తనదైన మార్క్, బ్రాండ్‌ను చాటి చెప్పిన నటుల్లో కమల్ హాసన్ ఒకరు. ఎప్పుడూ ఏదో ప్రయోగంతో మనముందుకు వచ్చే కమల్‌కు తమిళంతో పాటు తెలుగులోనూ భారీ మార్కెట్ ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆయన తెలుగులో ఓ స్ట్రైట్ సినిమా చేసి చాలా కాలమే అయింది. గతంలో ‘స్వాతిముత్యం’, ‘సాగర సంగమం’ లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించిన కమల్ చేసిన చివరి స్ట్రైట్ తెలుగు సినిమా ‘ఈనాడు’. చాలా కాలంగా ఆయన తెలుగులో స్ట్రైట్ సినిమా చేయాలన్న ఆలోచన గురించి చెప్పగా, చివరికది ‘చీకటి రాజ్యం’తో సాధ్యపడింది/
తెలుగుతో పాటు తమిళంలోనూ ఒకేసారి షూటింగ్ జరుపుకున్న ‘చీకటి రాజ్యం’ సినిమాకు రాజేష్ ఎమ్ సెల్వ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు తమిళంలో ‘తూంగవనం’ అనే టైటిల్ పెట్టారు. గతంలో కమల్ హీరోగా రూపొందిన పలు సినిమాలకు రాజేష్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు.కొన్ని నెలల క్రితం హైద్రాబాద్‌లో మొదలైన ఈ సినిమా షూటింగ్ నిన్నట్లితో పూర్తి అయినట్లు సినిమా యూనిట్ తెలిపింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతుండగా త్వరలోనే సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించే ఆలోచనలో సినిమా యూనిట్ ఉంది. ఈ సినిమాలో కమల్ సరసన త్రిష హీరోయిన్గా నటించగా, గిబ్రాన్ సంగీతం సమకూర్చారు.


