40 సుధీర్గ ఎపిసోడ్ ల తరువాత ఈరోజు నాగార్జున హోస్ట్ చేసిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ఫస్ట్ సీజన్ ముగిసింది. ఈ సీజన్ చివరి షోకి విశిష్ట అతిధిగా మెగా స్టార్ చిరంజీవిని ఆహ్వానించడంలో మా టి.వి యాజిమాన్యమంతా సఫలీకృతమయ్యారు. చాన్నాళ్ళ తరువాత చిరుని సూటు, బూటు వేసుకుని ఒక గేమ్ షో లో పాల్గోవడంతో ఆయన అభిమానులు ఆనందానికి అవధులు లేవు
ఈ షోని నేను చాలా దగ్గరగా చూస్తున్నానని, ఎందరో కలల్ని నిజం చేసిన గేమ్ షోగా మీలో ఎవరు కోటీశ్వరుడు మారిందని ఈ సీజన్ లో కొంతమంది కాంటెస్టంట్ ల జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. మీ ఎదుగుదలే స్పూర్తిదాయకమైతే మీ మాటలు మరింత స్పూర్తిదాయకమని నాగ్ తన మిత్రుడు చిరుని పొగడ్తలలో ముంచెత్తాడు
పనిలోపనిగా తన 150వ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుంది అన్న ప్రశ్నకు ప్రజలకు నేను నటించాలని కోరుకుంటే తప్పకుండా సినిమా మొదలుపెడతానని ఈ ఏడాదిలోనే ఈ చిత్రం మొదలుకానుందని, మంచి కధ కోసం అందరం ఎదురుచూస్తున్నామని తెలిపారు. దీంతో అక్కడ చిరు మాట వింటున్న ప్రేక్షకులంతా హర్షద్వానాలతో స్టేజ్ ని మోతమోగించడం గమనార్హం. దీనిబట్టి చిరు 150వ సినిమా ఈ ఏడాదిలోనే మొదలవుతుంది అన్న విషయం తెలిసింది


