పవన్.. సినిమాలు మానొద్దు : చిరంజీవి
Published on Mar 20, 2016 11:08 pm IST

sardar
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. పవన్ హీరోగా నటించగా, దర్శకుడు బాబీ తెరకెక్కించిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాకు సంబంధించిన ఆడియో ఆవిష్కరణ వేడుక ఈ సాయంత్రం హైద్రాబాద్‌లోని నోవాటోల్‌లో వైభవంగా జరిగింది. ఈ వేడుకకోసం గత నెలరోజులుగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన అభిమానులు, చివరకు ఆ రోజు వచ్చేయడంతో ఉత్సాహంలో మునిగిపోయారు. ఇక సాధారణంగానే సర్దార్ ఆడియో రిలీజ్‍కు మొదట్నుంచీ మంచి క్రేజ్ ఉండగా, మెగాస్టార్ చిరంజీవి ఈ వేడుకకు హాజరు కావడంతో ఆ క్రేజ్ రెట్టింపు అయింది.

మెగాస్టార్ ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరై దేవిశ్రీ ప్రసాద్ అందించిన ఆడియోను విడుదల చేసి సినిమా యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్‌లో మంచి నటుడు ఉన్నాడని గమనించే అతడిని హీరో చేశామని, ఈరోజు సినీ పరిశ్రమలో తనదైన బ్రాండ్ సెట్‌చేసుకొని ఈ స్థాయిలో పవన్ ఉన్నాడంటే అది అతడి నిరంతర కృషివల్లే అని అన్నారు. ఇక గత కొద్దికాలంగా పవన్ సినిమాలను మానెయ్యనున్నాడనే ప్రచారం జరుగుతోందని, అలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా అభిమానులకు ఆనందాన్ని పంచాలని చిరు, పవన్‍కు ఈ సందర్భంగా ఓ సలహా ఇచ్చారు.

ఇక పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. తనకు అందరికన్నా పెద్ద హీరో అన్నయ్య చిరంజీవియే అని, అన్నయ్య ప్రోత్సాహంతోనే హీరో కాగలిగానని ఉద్వేగంగా మాట్లాడారు. ఇక ఈ వేడుకలో సర్దార్ దర్శకుడు బాబీ, నిర్మాత శరత్ మరార్, హీరోయిన్ కాజల్ అగర్వాల్, దర్శకుడు త్రివిక్రమ్ తదితరులు పాల్గొన్నారు.

 
Like us on Facebook