చిట్ చాట్ : గుణశేఖర్ – చిరు గారి రియాక్షన్ నన్ను షాక్ చేసింది.

చిట్ చాట్ : గుణశేఖర్ – చిరు గారి రియాక్షన్ నన్ను షాక్ చేసింది.

Published on Oct 5, 2015 8:57 PM IST

guna-shekar
టాలీవుడ్ లో భారీ చిత్రాల దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వం వహించిన హిస్టారికల్ ఫిల్మ్ ‘రుద్రమదేవి’. 9 ఏళ్ళు రీసర్చ్ చేసి, మూడేళ్ళు కష్టపడి తీసిన ఈ సినిమా అక్టోబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి తీసిన రుద్రమదేవి గురించిన కొన్ని విశేషాలను గుణశేఖర్ మీడియాతో పంచుకున్నాడు. ఆ విశేషాలు మీకోసం…

ప్రశ్న) రుద్రమదేవికి దర్శకుడు మరియు నిర్మాత మీరే.. ఈ రెండు బాధ్యతల్లో దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఈ సినిమా చేసారు.?

స) పేరుకి నిర్మాతని నేనే అయినా నిర్మాతగా నేను ఎలాంటి టెన్షన్ తీసుకోలేదు. ఆ టెన్షన్ మొత్తం నా సతీమణి తీసుకుంది. తనే దగ్గరుండి అన్ని నిర్మాణ బాధ్యతలు చూసుకుంది. నాకు ఏం కావాలన్నా కూడా తననే అడిగేవాన్ని. నేను పూర్తిగా ఓ దర్శకుడిగానే ఈ సినిమాకి పనిచేసాను. నేను తీయబోతున్నది ఒక చరిత్ర దాన్ని పర్ఫెక్ట్ గా చెప్పాలి, అలాంటప్పుడు ఒకేసారి నిర్మాత, దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించలేను. అందుకే దర్శకుడిగానే ఉన్నాను.

ప్రశ్న) విజువల్స్ పరంగా ప్రేక్షకులకు ఎలాంటి అనుభవాన్ని ఇవ్వబోతున్నారు.?

స) నేను మరోసారి చెప్పదలుచుకున్నాను. ఇది విజువల్స్ కోసం తీసిన సినిమా కాదు. అలాగే విఎఫ్ఎక్స్ బేస్డ్ మూవీ కాదు. నేను ఒక చరిత్రని చెప్పాలనుకున్నాను. ఆ కథ చూస్తున్నప్పుడు ఆడియన్స్ ఎక్కడా పక్కకి వెళ్ళకూడదు, కథనే ఫీల్ అవ్వాలి. అందుకే ఈ చారిత్రాత్మక కథకి ఎంత మేరకు విజువల్ ఎఫెక్ట్స్ అవసరమో అంతే చేసాం. అంతే కానీ కథకి మించిన విజువల్స్ కోసం ఆరాటపడలేదు. కచ్చితంగా 13వ దశాబ్దాన్ని కళ్ళముందు చూపించేలా విజువల్స్ మరియు కథ ఉంటుంది.

ప్రశ్న) రుద్రమదేవి సినిమా అనగానే మీకు ప్రత్యేకంగా ఎవరెవరి నుంచి సపోర్ట్ లభించింది.?

స) రుద్రమదేవి సినిమా అనుకాగానే నాకు ముందు ముగ్గురు అండగా నిలబడ్డారు. వాళ్ళే అనుష్క, రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్.. వీరి తర్వాత అల్లు అర్జున్ ఇచ్చిన సపోర్ట్ మరువలేనిది. అలాగే కృష్ణంరాజు గారైతే మొదటి రోజు సెట్లోకి వచ్చి సెట్ చూడగానే మా సతీమణితో మీ ఆయన మామూలు సినిమా చేయడం లేదు అని చెప్పి తన మేనేజర్ కి వీళ్ళకి ఎన్ని డేట్స్ కావాలో అన్ని ఇచ్చేయ్, మనీ కూడా వాళ్ళు ఇచ్చినప్పుడే తీసుకో అని సపోర్ట్ ఇచ్చారు.

ప్రశ్న) బాహుబలి సినిమా బిజినెస్ మరియు మార్కెటింగ్ స్ట్రాటజీ ఈ సినిమాకి బాగా హెల్ప్ అయినట్టుంది.?

స) చెప్పాలంటే బాహుబలి సినిమాకంటే మా సినిమా ముందే మొదలైంది, ముందే షూటింగ్ పూర్తి చేసుకుంది, అలాగే బిజినెస్ కూడా ముందే పూర్తయ్యింది. కానీ బాహుబలి లాంటి సినిమా ఒకటి ప్రూవ్ చేసింది. అదే ఆడియన్స్ సపోర్ట్.. మీరు ఇలాంటి సినిమాలు తీయండి మీకు మా సపోర్ట్ ఉంటుంది, మేము ఆదరిస్తాం అనే విషయాన్ని ప్రూవ్ చేసింది. ఆ కారణం చేత ఈ సినిమాకి మిగతా భాషల్లో అవకాశాలు వచ్చాయి. ముఖ్యంగా హిందీలోకి ఈ సినిమా వెళ్ళడానికి మాత్రం బాహుబలి సక్సెస్. అక్కడ ఆ సినిమా అన్ని రికార్డ్స్ సృష్టించడం వలెనే రుద్రమదేవికి మంచి ఆఫర్స్ వచ్చాయి.

ప్రశ్న) మెగాస్టార్ చిరుతో వాయిస్ ఓవర్ చెప్పించాలనే ఆలోచన ఎవరిది.?అప్రోచ్ అవ్వగానే ఆయన రియాక్షన్ ఏంటి.?

స)
లగాన్ లాంటి గొప్ప సినిమాకి అమితాబ్ వాయిస్ పర్ఫెక్ట్ గా సరిపోవడమే కాకుండా సినిమాకి హెల్ప్ అయ్యింది. అలానే నా ఈ చారిత్రాత్మక సినిమాకి ఓ పర్ఫెక్ట్ వాయిస్ ఓవర్ పడాలి అని అందరి సలాహాలు అడుగుతుంటే బన్ని వెంటనే చిరు గారైతే బాగుంటుంది అన్నారు. అవును బాగుంటుంది అని చిరు గారిని కలవడానికి వెళ్లాను. ఆయన దగ్గరికి వెళ్లి ఇలా నేను రుద్రమదేవి అనే సినిమా చేస్తున్నా దానికి మీ సాయం అంటుండగానే మధ్యలోనే నన్ను ఆపి నువ్వో అద్భుతమైన సినిమా చేస్తున్నావ్, ఆ సినిమాకి నేను ఉపయోగపడతాను అంటే వాడుకో, ఏం చెయ్యమంటావో చెప్పు చేస్తా అన్నారు. అది నన్ను షాక్ కి గురిచేసింది. నేను ఇలా వాయిస్ ఓవర్ అనగానే, ఎప్పుడ రావాలో చెప్పు అని చెప్పి నాకు పూర్తి సపోర్ట్ ఇచ్చిన చిరు గారికి నా స్పెషల్ థాంక్స్.

ప్రశ్న) లీడ్ రోల్ చేసిన అనుష్క గారి సపోర్ట్ మీకు ఎంతవరకూ ఉంది.?

స) అనుష్క గారికి నేను థాంక్స్ అనే మాట చెబితే చాలా చిన్నదైపోతుంది ఎందుకంటే నేను ఈ ప్రాజెక్ట్ అనుకున్నప్పటి నుంచి నాతో పాటు ట్రావెల్ అవుతున్నారు. ఒక హీరో కూడా కష్టపడని రీతిలో ట్రైనింగ్ డేస్ నుంచి ఇప్పటికీ నాకు ఎప్పుడు తన పరంగా ఏ సాయం చెయ్యాలన్నా చేస్తున్నారు. షూట్ మొత్తం అయ్యాక ఎప్పుడన్నా కాల్ చేసి ఒక క్లోజ్ షాట్ ఉంటే బాగుండేది మీది కావలి అంటే ఇప్పుడు వచ్చేయనా అని చెప్పి వచ్చి చేసి వెళ్ళారు. ఒక్క మాటలో చెప్పాలంటే అనుష్క గారు లేకపోతే రుద్రమదేవి అనే సినిమా ఉండేది కాదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు