
సినిమాలపై మమకారంతో మరో యువ నిర్మాత ఈ రంగుల ప్రపంచంలో అడుగుపెడుతున్నారు. శివాజీ, కైనాజ్ మోతివాలా జంటగా రేవన్ యాదు దర్శకత్వంలో రూపొందిన ‘బూచమ్మ బూచోడు’ సినిమా ద్వారా ప్రసాద్ రెడ్డి నిర్మాతగా పరిచయం అవుతున్నారు. మరో నిర్మాత అన్నెంరెడ్డి రమేష్ తో కలసి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. సెప్టెంబర్ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సందర్భంగా ‘బూచమ్మ బూచోడు’ సినిమా విశేషాలను తెలియజేయడానికి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రసాద్ రెడ్డి చెప్పిన విశేషాలు మీకోసం..
ప్రశ్న) మీ నేపధ్యం గురించి చెప్పండి..?
స) ఫార్మాస్యూటికల్ రంగంలో విజయవంతమైన వ్యాపారవేత్తగా ఉన్న నేను సినిమాలపై ఆసక్తితో ఈ రంగంలో అడుగుపెట్టాను. హేజెన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ స్థాపించి తొలి ప్రయత్నంగా ‘బూచమ్మ బూచోడు’ నిర్మించాము. నా స్నేహితుడు, స్నేహ సినిమాస్ అధినేత అన్నెంరెడ్డి రమేష్ తో కలసి ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది.
ప్రశ్న) ‘బూచమ్మ బూచోడు’ ద్వారా నిర్మాతగా మారడానికి గల కారణాలేంటి..?
స) శివాజీ, నేను మంచి స్నేహితులం. ఒక మంచి కథతో నిర్మాతగా చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టాలని ఎదురు చూస్తున్నాను. శివాజీ ద్వారా దర్శకుడు రేవన్ యాదు పరిచయం అయ్యారు. అతను చెప్పిన కథ నచ్చడంతో ‘బూచమ్మ బూచోడు’ సినిమాను నిర్మించాం. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కధాంశంతో మా సినిమా తెరకెక్కింది.
ప్రశ్న) మీకిదే తొలి సినిమా, నిర్మాణ సమయంలో ఏవైనా సమస్యలు ఎదుర్కొన్నారా..?
స) మేం అనుకున్న సమయంలో, అనుకున్న బడ్జెట్ లో సినిమాను తెరకెక్కించాం. ఈ విషయంలో హీరో శివాజీకి, మా శ్రేయోభిలాషి నిర్మాత బెక్కం వేణుగోపాల్ లకు కృతజ్ఞతలు చెప్పాలి. కథ ఓకే చేసిన తర్వాత నేను, మరో నిర్మాత అన్నెంరెడ్డి రమేష్ కనీసం షూటింగ్ కి కూడా హాజరుకాలేదు. వేణు గారు, శివాజీ దగ్గరుండి సినిమాను తమ సొంత సినిమాలా భావించి పూర్తి చేశారు.
ప్రశ్న) మీరు షూటింగ్’కు వెళ్ళలేదన్నారు. సినిమా మీరనుకున్న విధంగా వచ్చిందా..? చెప్పిన కథను తెరకెక్కించారా..?
స) సినిమా ఫస్ట్ చూశాను. దర్శకుడు సినిమాను అద్బుతంగా చిత్రీకరించారు. ప్రేక్షకులకు కామెడీ అందించాలి అనే ఉద్దేశ్యంతో మొదట చెప్పిన కథకు కొన్ని సన్నివేశాలు జత చేశారు. వాటిలో జబర్దస్త్ రియాలిటీ షో ఆర్టిస్టులతో నటించారు. ఆ సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. మిగతా సినిమా అంతా చెప్పినట్టే తెరకెక్కించారు.
ప్రశ్న) ‘బూచమ్మ బూచోడు’ సినిమాలో హైలైట్స్ ఏంటి..?
స) హారర్ కామెడీ జోనర్’లో తెరకెక్కిన ఫ్యామిలీ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా ఇది. కొత్తగా పెళ్ళైన భార్యాభర్తల మధ్య ఏం జరిగింది అనే కధాంశంతో సినిమా రూపొందింది. శివాజీ, కైనాజ్ మోతివాలా (రాగిణి యంయంఎస్ ఫేం) నటన, శేఖర్ చంద్ర సంగీతం, శ్రీమణి లిరిక్స్ సినిమాకి మేజర్ హైలైట్స్.
ప్రశ్న) మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి..?
స) ‘లవ్ స్టేట్స్’ అనే ట్రయాంగిల్ లవ్ స్టొరీని నిర్మిస్తున్నాం. రాష్ట్ర విభజన నేపధ్యంలో ఆ సినిమా ఉంటుంది. ‘బూచమ్మ బూచోడు’ సినిమాను ప్రపంచవ్యాప్తంగా దాదాపు 300 థియేటర్లలో విడుదల చేస్తున్నాం. ప్రేక్షకుల స్పందన కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాం అని ఇంటర్వ్యూను ముగించారు.

