సమీక్ష : చిత్రలహరి- సక్సెస్ కోసం ఆరాటపడే ఓ యువకుడి కథ !

Published on Apr 13, 2019 2:30 am IST
Chitralahari movie review

విడుదల తేదీ : ఏప్రిల్ 12, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు : సాయిధరమ్ తేజ, కళ్యాణి ప్రియదర్శన్, నివేథ పేతురాజ్ తదితరులు.

దర్శకత్వం : కిషోర్ తిరుమల

నిర్మాత : నవీన్ యెర్నేని , వై రవిశంకర్, మోహన్ చెరుకూరి

సంగీతం : దేవీశ్రీ ప్రసాద్

ఎడిటర్ : శ్రీకర్ ప్రసాద్

కిషోర్ తిరుమల దర్శకత్వంలో మెగా మేనల్లుడు సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘చిత్రలహరి’. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన కళ్యాణి ప్రియదర్శని నటించింది. అలాగే మరో హీరోయిన్ నివేథ పేతురాజ్ కూడా కీలక పాత్రలో నటించింది. ఇక టీజర్ అండ్ ట్రైలర్ తో అంచనాలను పెంచేసిన ఈ సినిమా ఎలా ఉందనేది సమీక్ష లోకి వెళ్లి చూద్దాం..

 

కథ :

తన జీవితంలో ఎప్పుడూ సక్సెస్‌ చూడని.. అలాగే సక్సెస్‌ అంటే ఏంటో కూడా తెలియని విజయ్‌ కృష్ణ (సాయి తేజ్) అనే యువకుడు తన ఫెయిల్యూర్స్‌ ను అధిగమించి చివరికి సక్సెస్‌ ని ఎలా సాధించాడు ? అసలు సక్సెస్ కి మీనింగ్ ను ఎలా తెలుసుకున్నాడు ? అనే విషయాలకు సంబంధించిన అంశాలే ఈ సినిమా కథ. అయితే హీరో సక్సెస్ సాధించే క్రమంలో అతను లహరి (కళ్యాణి ప్రియదర్శన్)తో ఎలా ప్రేమలో పడ్డాడు ? ఆ తరువాత జరిగే కొన్ని నాటకీయ పరిణామాల మధ్య
వారి ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు జరిగాయి ? ఆ గొడవలకు స్వేచ్ఛ (నివేథ పేతు రాజ్) ఎలా కారణం అయింది ? అలాగే చివరికి విజయ్ కృష్ణ తిరిగి స్వేచ్ఛ (నివేథ పేతు రాజ్) కారణంగా జీవితంలో మరియు ప్రేమలో మళ్ళీ ఎలా సక్సెస్ సాధించాడు ? అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

బ్లాక్ బస్టర్ కొట్టాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమా కోసం అన్నీ రకాల జాగ్రత్తలు తీసుకుని మరి చేసిన సాయి ధరమ్ తేజ్ ఈ సినిమా కోసం పెట్టిన ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఫెయిల్యూర్స్‌ కి కేరాఫ్ అఫ్ అడ్రస్ లాంటి విజయ్‌ కృష్ణ అనే క్యారెక్టర్‌ లో తేజ్ చక్కని నటనను కనబరిచాడు. గత సినిమాల్లో కంటే, ఈ సినిమాలో తేజ్ నటన ఆకట్టుకుంటుంది. మెయిన్ గా సినిమాలో అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేస్తూనే, ఇటు సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో కొన్ని హెవీ ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా హీరోగా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు.

ఇక తేజ్ సరసన కథానాయకిగా నటించిన కళ్యాణి ప్రియదర్శన్ తన స్క్రీన్ ప్రెజెన్స్ మరియు తన గ్లామర్ తో పాటుగా తన నటనతోనూ మెప్పించే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో మరియు ప్రేమ సన్నివేశాల్లో ఆమె చాలా బాగా నటించింది. వారి మధ్య సీన్లు, వారి మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే అలరిస్తుంది. అలాగే మరో హీరోయిన్ నివేథ పేతురాజ్ నటన కూడా చాలా బాగుంది.

ఇక తేజ్ కి తండ్రిగా నటించిన పోసానికి తేజ్ కి మధ్య వచ్చే సన్నివేశాలు అలరిస్తాయి. కమెడియన్స్ వెన్నెల కిషోర్, సునీల్, హైపర్ ఆది తమ కామెడీ టైమింగ్ తో మ్యానరిజమ్స్ తో కొన్ని చోట్ల నవ్వించారు. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. కిషోర్ తిరుమల ఎమోషనల్ సన్నివేశాల్లో మంచి దర్శకత్వ పనితనం కనబరిచారు.

 

మైనస్ పాయింట్స్ :

దర్శకుడు కిషోర్ తిరుమల మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నప్పటికి ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథనాన్ని మాత్రం రాసుకోలేదు. దీనికి తోడు సినిమాలో కొన్ని సన్నివేశాలు స్లోగా సాగుతాయి. ఫస్ట్ హాఫ్ లో హీరోయిన్ ప్రేమలో పడే సన్నివేశాలను బాగా రాసుకున్న దర్శకుడు, సెకెండ్ హాఫ్ లో లవ్ సీన్స్ ను ఆ స్థాయిలో రాసుకోలేదు. అయితే సినిమాలో దర్శకుడు చెప్పాలనుకున్న మెయిన్ థీమ్ బాగుంది.

ఇక సినిమాలో మెయిన్ పాయింట్ ను మొదటినుంచి బాగా ఎలివేట్ చేసిన దర్శకుడు, క్లైమాక్స్ లో ఆ పాయింట్ కి తగ్గ స్థాయిలో ఇంకా సరైన ముగింపు ఇస్తే బాగుండేది. అలాగే జీవితంలో ఎప్పుడూ సక్సెస్‌ చూడని హీరో, అసలు సక్సెస్‌ అంటే ఏంటో కూడా తెలియని హీరో.. మొదటి సారి సక్సెస్ అయ్యే సీక్వెన్స్ ను దర్శకుడు ఇంకా బలంగా రాసుకోవాల్సింది.

 

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. కొన్ని సన్నివేశాలను ఎమోషనల్ గా కిషోర్ తిరుమల బాగా తెరకెక్కించారు. అయితే ఆయన కథనాన్ని ఇంకా బాగా రాసుకోని ఉండి ఉంటే సినిమా పూర్తి స్థాయిలో ఆకట్టుకునేది. దేవి శ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఆయన అందించిన పాటల్లో గ్లాస్ మెట్ సాంగ్ తో పాటు మరో రెండు పాటలు బాగా ఆకట్టుకుంటాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను చాలా బ్యూటిఫుల్ గా చిత్రీకరించారు. ఎడిటింగ్ కూడా బాగానే ఉంది. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వాళ్ళ నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.

 

తీర్పు :
ఈ సారి ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టాలనే ఉద్దేశ్యంతో కిషోర్ తిరుమల దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ఈ చిత్రం కొన్ని ఎమోషనల్ సన్నివేశాలతో పాటు అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్ తో సాగుతుంది. అయితే దర్శకుడు మనిషి ప్రాణానికి సంబంధించి మంచి స్టోరీ లైన్ తీసుకున్నప్పటికీ.. కొన్ని సన్నివేశాలను నెమ్మదిగా నడిపారు. అసలు సక్సెస్‌ అంటే ఏంటో తెలియని హీరో, లైఫ్ లో ఎప్పుడూ సక్సెస్‌ అవ్వని హీరో.. మొదటి సారి సక్సెస్ అయ్యే సీన్స్ ను ఇంకా బలంగా రాసి ఉంటే సినిమాకు బాగా ప్లస్ అయ్యేది. అలాగే సినిమాలో స్లోగా సాగే కొన్ని సీక్వెన్స్ స్ సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలుస్తాయి. ఐతే సాయి తేజ్, కళ్యాణి ప్రియదర్శన్ అలాగే నివేథ కూడా తమ నటనతో సినిమాలో బాగానే అలరించారు. మరి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఏ స్థాయిలో ఆదరిస్తారో చూడాలి.

 

123telugu.com Rating : 3/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం :