సింగర్ విజయలక్ష్మి , రామాచారి , పురాణపండ శ్రీనివాస్ లపై వెల్లువెత్తిన అభినన్దనలు

Published on Jul 7, 2022 6:49 am IST

Tanikella-Bharani

ఎస్పీ బాలుకి వంద గళాల ఘన నివాళి

హైదరాబాద్ : జూలై : 7

అందాల రాగం, సంగీత సంభాషణ, పరవశింపచేసే స్వరం, ధన్య ప్రసంగం …. ఇవన్నీ కలిస్తే ఇటీవల రవీంద్రభారతి వేదికపై తెలుగు సినీ మ్యూజిషియన్స్ యూనియన్ తెలంగాణా ప్రభుత్వ సాంస్కృతిక శాఖతో కలిసి అసాధారణ రీతిలో అద్భుతంగా నిర్వహించిన వందమంది గాయనీగాయకుల స్వర వైభవం మనల్ని ఇప్పటికీ ఇంకా ఉర్రూతలూగిస్తూనే వుంది. మహాగాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్మృతికి అపురూపంగా చాలా చక్కని రీతిలో వంద గళాలు ఒకే చోట చేరి పన్నెండు గంటలపాటు చేసిన పాటల వేడుక జంటనగరాలలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల కళాకారుల్ని, రసజ్ఞుల్ని , గాయనీ గాయకుల్ని ఆశ్చర్య పరిచింది.

ప్రఖ్యాత గాయనీమణులు ఉష , సునీత, విజయలక్ష్మి, గీతామాధురి, సురేఖామూర్తి, రమ్య బెహరా , కౌసల్య వంటి వారు మాత్రమే మాత్రమేకాకుండా ప్రఖ్యాత గాయకులు రామాచారి, రేవంత్, ఆర్ఫీ పట్నాయక్, రఘు కుంచె, శ్రీరామచంద్ర, శ్రీకృష్ణ , ఘంటాడి కృష్ణ , సింహ , హేమచంద్ర తదితరప్రముఖులు సభ్యులుగాగలిగిన ఈ తెలుగు సినీ మ్యూజిషియన్స్ నిర్వహించిన ‘ బాలు ‘ కి ప్రేమతో అనే ఈ స్వరవైభవం చరిత్రలో నిలిచిపోవడం తధ్యమంటున్నారు సంగీతప్రియులు.

ముఖ్య అతిధులుగా హాజరైన రసమయి బాలకిషన్, మామిడి హరికృష్ణ తనికెళ్ళ భరణి, పురాణపండ శ్రీనివాస్ , హీరో సుమన్ , నటుడు ఉత్తేజ్ , ఇంకా గేయ రచయితలు చంద్రబోస్, అనంతశ్రీరాం వంటి ప్రఖ్యాత వ్యక్తులు హాజరవ్వడంతో సభ ఇంకా రక్తి కట్టిందనడంలో సందేహం లేదు. మరొక ముఖ్యాంశమేంటే తెలుగునాట ఆధ్యాత్మిక రచనల్లో, సంకలనాల్లో ఆరితేరిన ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ ఈ అద్భుతకార్యక్రమంలో అకస్మాత్తుగా ప్రత్యక్షంకావడం రసజ్ఞ లోకాన్ని విస్మయ పరిచింది.

జీవన సర్వస్వాన్నీ సనాతధర్మ సేవకే అంకితం చేసిన పురాణపండ శ్రీనివాస్ గతంలో ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధికారిక మాసపత్రిక ‘ ఆరాధన ‘ గౌరవ సంపాదకునిగా, శ్రీశైల దేవస్థాన ప్రత్యేక సలహాదారులుగా సమర్ధవంతమైన ధార్మిక చైతన్యపు సేవలందించడమే కాకుండా ఇప్పుడు పురాణపండ శ్రీనివాస్ అపురూప గ్రంధాలు లేని తెలుగు లోగిళ్ళు ఉండవనే చెప్పాలి. శ్రీనివాస్ కృషి అలాంటిది. చాలాకాలంగా సభలకు, సమావేశాలకు దూరంగా ఉంటూ పరమాద్భుతమైన ఆధ్యాత్మిక కృషి చేస్తున్నగొప్ప వక్త పురాణపండ శ్రీనివాస్ ని ఈ సభలో స్టార్ సింగర్ విజయలక్ష్మి స్వయంగా ఘనంగా సత్కరించడం ప్రత్యేక విశేషంగానే చెప్పాలి.

ఈ దేశాన్ని ఇటీవల ఉర్రూతలూగించిన పాన్ ఇండియా మూవీస్ అయిన RRR , KGF -2 చిత్రాల దర్శకులు రాజమౌళి, ప్రశాంత్ నీల్ ప్రముఖరచయిత పురాణపండ శ్రీనివాస్ కి తమ చిత్రాల ప్రారంభంలోనే ఎంతటి ప్రాముఖ్యత ఇచ్చారో ఈ సభలో విజయలక్ష్మి వివరించినప్పుడు ఆడియన్స్ స్పందన వేరేలేవేల్లో ఉందనేది నిర్వివాదాంశం. అలాంటి పురాణపండ ఈ వేడుకకి అకస్మాత్తుగా హాజరవ్వడం రసజ్ఞుల్ని ఆకర్శించింది.

వందమంది ప్రముఖ గాయనీ గాయకులతో రవీంద్ర భారతి వేదిక ఒక అద్భుత వేడుకకి తెరతీసిన ఈ ఘట్టంలో … స్టార్ సింగర్ విజయలక్ష్మి, ప్రఖ్యాత గాయకులు రామాచారి ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించిన తీరు ఎన్నో సాంస్కృతిక సంస్థలకు ఆదర్శప్రాయమనే చెప్పాలి. విజయలక్ష్మి గొంతెత్తగానే హాలంతా ఈలలు, చప్పట్లే. ఏది ఏమైనా పాటలతో సింగెర్స్ చెలరేగిపోయారు. కార్యక్రమం అదిరిపోయింది. ఈ కార్యక్రమానికి చేయూతనిచ్చిన తెలంగాణా సాంస్కృతిక శాఖామంత్రి శ్రీనివాస గౌడ్ ని కూడా అభినందించాలి. సంపూర్ణంగా ప్రోత్సహించిన మామిడి హరికృష్ణని కూడా ప్రశంసించాల్సిందే.

విజయలక్ష్మి , రామాచారి సమర్పణలో … ప్రత్యేక పవిత్ర శోభతో… అమృతప్రాయపు విలువలతో మంత్రమయంగా నిర్మించిన ‘ శ్రీపూర్ణిమ ‘ మహాగ్రంధం ఈ సభలో సింగర్స్ కి, వాయిద్యకారులకి, అతిధులకు జ్ఞాపికగా అందజేయడం నిజంగా విశేషంగానే చెప్పాలి. ఈ శ్రీపూర్ణిమ బుక్ యొక్క లుక్ మరియు కంటెంట్ అదిరిపోయిందని కన్నులకు అద్దుకుని మరీ తీసుకున్నారు . జ్ఞాపిక అనగానే ఏదో ఒకటి చేతుల్లో పెట్టి చేతులు దులుపుకోకుండా … శ్రీపూర్ణిమ గ్రంధాన్ని తెలుగు సినీ మ్యూజిషియన్స్ యూనియన్ ప్రత్యేకంగా సెలెక్ట్ చేసుకుని మరీ యివ్వడం ఒక అద్భుతమని చెప్పాలి.

ఏదేమైనా HATS OFF TO తెలుగు సినీ మ్యూజిషియన్స్ యూనియన్. ఇలాంటివి మూడు నెలలకొకసారైనా జరుగుతూ ఉంటే ఆ ఆనందమే వేరు. బాలు సర్ … మీకింతకంటే ఈ సంగీతపు హృదయాలు ఏమి నివాళి ఇవ్వగలవు చెప్పండి. బాలు జీ అమర్ రహే. సింగర్ విజయలక్ష్మి మరియు రామాచారి గార్ల కృషిని అందరూ మనస్ఫూర్తిగా అభినందించడం ఆడిటోరియంలో విశేష స్పందన దర్శనమిచ్చింది.

సంబంధిత సమాచారం :