అవార్డు విన్నర్ సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన బోల్డ్ అండ్ రా రస్టిక్ మూవీ “కాక్రోచ్” విడుదలకు సిద్ధమవుతోంది. 70వ దశకం నుండి చిత్ర పరిశ్రమలో ఉన్న నిర్మాత బి.బాపిరాజు, దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డితో ఉన్న సుదీర్ఘ అనుబంధంతో ఈ చిత్రాన్ని నిర్మించారు. సమాజంలో ఆకలి, నిరుద్యోగం కారణంగా తప్పుదారి పట్టే యువత మరియు విధిలేని పరిస్థితుల్లో వ్యభిచార వృత్తిలోకి వచ్చే మహిళల జీవితాల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు ఆయన తెలిపారు. కొందరు క్రిమినల్స్ మరియు ఒక వేశ్య మధ్య సాగే విభిన్నమైన ప్రేమకథే ఈ చిత్రమని, సమాజంలోని కఠిన వాస్తవాలను దర్శకుడు చాలా హార్డ్ హిట్టింగ్ గా చూపించారని ఆయన పేర్కొన్నారు.
తన జర్నలిజం అనుభవాల నుండి సేకరించిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ కథను సిద్ధం చేశానని దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి తెలిపారు. సమాజంలో మనం చూసే పైపైన మెరుగుల కంటే, అట్టడుగు వర్గాల జీవితాల్లో ఉండే చీకటి కోణాలను, నేరస్థుల వెనుక ఉన్న ఎమోషనల్ బ్యాక్ స్టోరీని ఈ చిత్రంలో ఆవిష్కరించామని తెలిపారు. ఈ సినిమా కేవలం పెద్దలకు మాత్రమేనని, సెన్సార్ సభ్యులకు కూడా తన దృక్పథాన్ని వివరించి ఈ చిత్రాన్ని ఉన్నది ఉన్నట్లుగా రూపొందించానని ఆయన స్పష్టం చేశారు.
శ్రీ లక్ష్మి పిక్చర్స్ బ్యానర్ పై బి.బాపిరాజు, ముతుకి నాగసత్యనారాయణ నిర్మించిన ఈ చిత్రంలో అభిలాష్ సుంకర, ప్రేమసన్, నవీన్, తీర్థ ప్రధాన పాత్రల్లో నటించారు. రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా, డార్క్ బ్యాక్ డ్రాప్లో సాగే ఈ క్రైమ్ డ్రామా ప్రేక్షకులకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. మార్చి 6న ఈ చిత్రం థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది.
