మంచు మనోజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘కరెంట్ తీగ’. మంచు విష్ణు నిర్మించిన ఈ సినిమాలో జగపతి బాబు, సన్నీ లియోన్ కీలక పాత్రలు పోహించారు. నిర్మాణంతర కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. ఈ సందర్భంగా దర్శకుడు జి.నాగేశ్వర రెడ్డి మీడియాతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఆయన చెప్పిన విశేషాలు మీకోసం..
ప్రశ్న) ‘కరెంట్ తీగ’లో ఎలాంటి హీరోయిజం చూపించబోతున్నారు..?
స) కరెంటులో ఉన్న పవర్ హీరో క్యారేక్టరైజేషన్ లో ఉంటుంది. మనోజ్ చాలా ఎనర్జిటిక్ రోల్ లో కనిపిస్తారు. రియల్ లైఫ్ లో మనోజ్ ఇమేజ్ & కథకు పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని ‘కరెంట్ తీగ’ టైటిల్ పెట్టడం జరిగింది. లవ్, యాక్షన్, బ్రేక్ అప్.. ఇలా డిఫరెంట్ జోనర్ లలో మనోజ్ సినిమాలు చేశారు. ఈ సినిమాలో కొత్త మనోజ్ ను చూస్తారు. ‘కరెంట్ తీగ’లో మనోజ్ ఎమోషన్ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. క్లైమాక్స్ లో మనోజ్ అద్బుతమైన నటన కనబరిచాడు.
ప్రశ్న) జగపతి బాబు క్యారెక్టర్ గురించి చెప్పండి..?
స) హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తండ్రిగా జగపతిబాబు నటించారు. ఆ పాత్రలో వేరే నటుడిని ఊహించుకోవడం కష్టం, ఇతరులు చేయలేరు కూడా. జగపతి బాబు గారు అంత బాగా నటించారు. హీరో హీరోయిన్ కలవకుండా అడ్డుపడే పాత్ర ఆయనది. జగపతి బాబు వేసిన చిన్న పందెంతో కథ ప్రారంభం అవుతుంది. జగపతి బాబు, మనోజ్ మధ్య సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి.
ప్రశ్న) అంటే ఇక హీరోయిన్ పాటలకే పరిమితమా..?
స) కథను బ్రతికించే పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. కథతో పాటు ఆమె క్యారెక్టర్ ట్రావెల్ అవుతుంది. పాటల కోసం హీరోయిన్ ను తీసుకోలేదు. నటనకు చాలా ఆస్కారమున్న పాత్ర. ‘కరెంట్ తీగ’ సినిమాతో రకుల్ ప్రీత్ సింగ్ కు మంచి పేరొస్తుంది.
ప్రశ్న) టీచర్ పాత్రకు సన్నీ లియోన్ ను తీసుకోవడానికి గల ప్రత్యేక కారణం..?
స) ప్రేక్షకులు థియేటర్లకు రావాలంటే సినిమాపై ఆసక్తి కలిగించాలి. యూత్ లో సన్నీ లియోన్ కి క్రేజ్ ఉంది. సినిమాలో ఆమె నటిస్తే క్రేజ్ ఏర్పడుతుందని ఆమెను తీసుకోవడం జరిగింది. ఒక పాటతో పాటు మరికొన్ని సన్నివేశాలలో సన్నీ లియోన్ కనిపిస్తుంది. సన్నీ లియోన్ ని పెళ్లి చేసుకునే వ్యక్తిగా సంపూర్నేష్ బాబు నటించారు. వీరి మధ్య జరిగే కామెడీ ట్రాక్ ప్రేక్షకులను అలరిస్తుంది.
ప్రశ్న) సన్నీ లియోన్ పాట వలన సినిమాకి ఏ సర్టిఫికేట్ వచ్చిందట కదా..?
స) అది నిజమే, అయితే ఆ పాటలో ఎక్కడా అశ్లీలత ఉండదు. బ్యాక్ గ్రౌండ్ డాన్సర్స్ వేసుకున్న కాస్ట్యూమ్స్ వలన సెన్సార్ నిబంధనల ప్రకారం సినిమాకి ‘ఏ’ సర్టిఫికేట్ ఇచ్చారు. సెన్సార్ సబ్యులు సినిమా చూసి మెచ్చుకున్నారు. ఫ్యామిలీ అంతా కలసి చూడదగ్గ సినిమా ఇది.
ప్రశ్న) మోహన్ బాబు గారి బ్యానర్ లో రెండవ సినిమా చేస్తున్నారు. మీ ఎక్స్ పీరియన్స్..?
స) మంచు ఫ్యామిలీ చాలా మంచి ఫ్యామిలీ. మోహన్ బాబు గారి బ్యానర్ లో రెండవ సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది. దర్శకులకు చాలా ఫ్రీడం ఇస్తారు. కథ, సినిమాపై దర్శకుడికి క్లారిటీ ఉంటె ఎలాంటి ఇబ్బంది ఉండదు. ‘దేనికైనా రెడీ’ సమయంలో చాలా మంది నన్ను భయపెట్టారు, అక్కడ పని చేయడం కష్టం అని. నాకు అలాంటి బ్యాడ్ ఎక్స్ పీరియన్స్ ఏమి లేదు.
ప్రశ్న) దర్శకుల పనిలో మనోజ్ వేలు పెడతారు అనే ప్రచారం బయట జరుగుతుంది..?
స) బేసిక్ గా మనోజ్ ఒక స్టంట్ కొరియోగ్రాఫర్. ఒక యాక్షన్ సన్నివేశం అద్భుతంగా రావడం చాలా కష్టపడతాడు, రిస్క్ చేస్తాడు. తగిన జాగ్రత్తలు తీసుకుని ఫైట్లు కంపోజ్ చేస్తాడు. నాకు కావలసిన విధంగా, నా కాన్సెప్ట్ చెప్పి అతనితో ఫైట్స్ చేయించుకున్నాను. అందులో తప్పేముంది, ఇతర ఫైట్ మాస్టర్ లతో కూడా అలాగే పని చేయించుకుంటాం. తమ పని మీద క్లారిటీ లేని దర్శకులు చేసే ఆరోపణలు అవి, పట్టించుకొనవలసిన అవసరం లేదు.
ప్రశ్న) ఫస్ట్ కాపీ చూసిన తర్వాత మోహన్ బాబు గారు ఏమన్నారు..?
స) నా సినిమాలకు మొదటి ప్రేక్షకుడు మోహన్ బాబు గారే. నిర్మొహమాటంగా అయన అభిప్రాయాన్ని మనతో చెప్పేస్తారు. ‘కరెంట్ తీగ’ సినిమా చూసిన తర్వాత మోహన్ బాబు మరియు ఫ్యామిలీ సభ్యులు చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ సినిమా మనోజ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని నేను భావిస్తున్నాను. ఈ నెల 17న ప్రేక్షకుల ఇచ్చే తీర్పు కోసం ఎదురు చూస్తున్నాను. అంటూ ఇంటర్వ్యూను ముగించారు.


