సమీక్ష : దర్శిని – బోరింగ్ సిల్లీ సస్పెన్స్ డ్రామా

సమీక్ష : దర్శిని – బోరింగ్ సిల్లీ సస్పెన్స్ డ్రామా

Published on May 18, 2024 3:02 AM IST
Darshini Movie Review in Telugu

విడుదల తేదీ : మే 17, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 1.5/5

నటీనటులు: వికాస్, శాంతి, వెంకట సత్య ప్రసాద్ మరియు తదితరులు.

దర్శకుడు: డాక్టర్ ప్రదీప్ అల్లు

నిర్మాత: డాక్టర్ ఎల్.వి.సూర్యం

సంగీత దర్శకుడు: నిజాని అంజన్

ఎడిటింగ్: ప్రవీణ్ జైరాజ్

సంబంధిత లింక్స్: ట్రైలర్

వికాస్, శాంతి జంటగా డాక్టర్ ప్రదీప్ అల్లు దర్శకత్వంలో వి4 సినీ క్రియేషన్స్ బ్యానర్ పై డాక్టర్ LV సూర్యం నిర్మాతగా తెరకెక్కిన సినిమా దర్శిని. కాగా ఈరోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :

సంతోష్ (వికాస్) ప్రియా (శాంతి) తమ ఫ్రెండ్ తో కలిసి డాక్టర్ దర్శని ఇంటికి వస్తారు. ఇంతకీ, ఈ డాక్టర్ దర్శని ఎవరు ?, భవిష్యత్తులో ఏం జరుగుతుందో ముందే చూడగలిగే టెక్నాలజీ కనిపెట్టింది ఎవరు ?, భవిష్యత్తు తెలుసుకునే ఆ టెక్నాలజీ కారణంగా సంతోష్ – ప్రియా జీవితాల్లో చోటు చేసుకున్న నాటకీయ సంఘటనలు ఏమిటి ?, ఇంతకీ, సంతోష్ – ప్రియా ప్రేమ వ్యవహారం ఎలా సాగింది ?, ఈ మధ్యలో వాళ్ళకు ఎదురైన ఇబ్బందులు ఏమిటి ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాలో హీరోగా నటించిన వికాస్ తన డైలాగ్ డెలివరీ, తన బాడీ లాంగ్వేజ్ తో అలాగే, కొన్ని ఎమోషనల్ అండ్ సస్పెన్స్ సీక్వెన్స్ స్ లో చాలా బాగా నటించాడు. మరో ప్రధాన పాత్రలో నటించిన వెంకట సత్య ప్రసాద్ కూడా పర్వాలేదు. క్లైమాక్స్ లో దర్శిని క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చిన ట్విస్ట్ జస్ట్ ఓకే అనిపిస్తోంది. ఇక శాంతి తన హోమ్లీ లుక్స్ లో అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంది. (కాకపోతే, ఆమె నటన మాత్రం ఇబ్బంది పెడుతుంది).

మైనస్ పాయింట్స్ :

సినిమా మెయిన్ పాయింట్ లో ఉన్న మ్యాటర్ కూడా.. సినిమాలో లేదు. తీసుకున్న పాయింట్ కి తగ్గట్టు స్క్రీన్ ప్లే రాసుకోవడంలో దర్శకుడు డాక్టర్ ప్రదీప్ అల్లు విఫలం అయ్యాడు. అసలు ఇలాంటి కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఆ కాన్సెప్ట్ కి తగ్గట్టు సినిమాని ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ ర‌క్తి కట్టేలా సాగాలి, కానీ ఈ సినిమాలో అది పూర్తిగా మిస్ అయింది.

నిజానికి కథనానికి అనుగుణంగా జరుగుతున్న డ్రామాను ఎవరు చేస్తున్నారు అనే అంశంలోనే బోలెడు సస్సెన్స్ ను మెయింటైన్ చేయవచ్చు. కానీ.. ఈ విషయంలోనూ సినిమా ఎఫెక్టివ్ గా లేదు. హీరో వికాస్ చేసే ప్లాన్ లోనూ ఎక్కడా లాజిక్ లేదు. పైగా దర్శని పాత్ర మీదే మెయిన్ ప్లాట్ మొత్తం సాగడంతో సినిమాలో అదే పెద్ద మైనస్ అయింది. దానికి తోడు కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా ఫేక్ గా అనిపిస్తాయి.

దర్శకుడు ప్రదీప్ అల్లు సెకండాఫ్ ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఇంట్రెస్ట్ గా నడుపుదామని మంచి ప్రయత్నం అయితే చేశారు గానీ, అది స్క్రీన్ మీద అసలు వర్కౌట్ కాలేదు. పైగా సినిమాలో సిల్లీ ట్రాక్స్ కూడా మైనస్ అయ్యాయి. మొత్తానికి ఈ సినిమా బాగా నిరాశ పరిచింది.

సాంకేతిక విభాగం :

టెక్నికల్ గా చూసుకుంటే సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ కూడా బాగాలేదు. కాకపోతే, నిజాని అంజన్ సంగీతం సినిమాకు ప్లస్ అయింది. ఇక సినిమాటోగ్రఫీ బాగాలేదు. కొన్ని కీలక సన్నివేశాల్లో కెమెరామెన్ పనితనం అస్సలు బాగాలేదు. ఎడిటర్ ప్రవీణ్ జైరాజ్ వర్క్ సినిమాకి తగ్గట్టు ఉంది. సినిమాలోని నిర్మాత డాక్టర్ ఎల్.వి.సూర్యం పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ ఏవరేజ్ గా ఉన్నాయి. ఇక దర్శకుడు డాక్టర్ ప్రదీప్ అల్లు ఉత్కంఠభరితమైన కథనాన్ని రాసుకోలేదు.

తీర్పు :

‘దర్శిని’ అంటూ వచ్చిన ఈ చిత్రం బాగా నిరాశ పరిచింది. ఇంట్రెస్టింగ్ గా సాగని ట్రీట్మెంట్ తో పాటు మెయిన్ క్యారెక్టైజేషన్స్ బలహీనంగా సాగడం, కథలో మేటర్ లేకపోవడం, పైగా సినిమాలో ఫేక్ ఎమోషన్స్ వంటి అంశాలతో పాటు లాజిక్ లెస్ డ్రామా కూడా సినిమా ఫలితాన్ని దెబ్బ తీసింది. ఓవరాల్ గా ఈ చిత్రం ఏ కోణంలోనూ ఆకట్టుకోదు.

123telugu.com Rating: 1.5/5

Reviewed by 123telugu Team

సంబంధిత సమాచారం

తాజా వార్తలు