నైజాంలో ‘పెద్ది’కి షాక్.. టికెట్ రేట్లు పెంచబోమంటున్న ఎగ్జిబిటర్స్..!

తెలంగాణలోని సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానులు ప్రస్తుత ‘రెంటల్ సిస్టమ్’ పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల థియేటర్లు నష్టాల్లో ఉన్నాయని, కేవలం నిర్మాతలే లాభపడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. అందుకే మల్టీప్లెక్స్‌ల తరహాలోనే ‘పర్సంటేజ్ సిస్టమ్’ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తాజాగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.

SVC కి చెందిన శిరీష్ రెడ్డి చేసిన ప్రకటన ఇప్పుడు ఇండస్ట్రీని ఉలిక్కిపడేలా చేసింది. ప్రభుత్వం జీవోల ద్వారా టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించినప్పటికీ, పెరిగిన ధరలతో సినిమాలను ప్రదర్శించకూడదని ఎగ్జిబిటర్లు సమిష్టిగా నిర్ణయించుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఇదే గనుక జరిగితే, మరికొద్ది రోజుల్లో విడుదల కానున్న రామ్ చరణ్ సినిమా ‘పెద్ది’కి ఇది గట్టి దెబ్బ కానుంది. సాధారణ టికెట్ రేట్లకే సినిమాను ప్రదర్శించాల్సి వస్తే వసూళ్లపై భారీ ప్రభావం పడే అవకాశం ఉంది.

నైజాం ఏరియాలో ‘పెద్ది’ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూట్ చేయనుంది. అయితే మైత్రీ సంస్థ ఇప్పటికే పర్సంటేజ్ సిస్టమ్‌కు వ్యతిరేకంగా తన గళాన్ని వినిపించింది. పద్ధతిని మార్చడం వల్ల భారీ బడ్జెట్ సినిమాలకు రికవరీ కష్టమని వారి వాదన. ఈ వివాదం ఇలాగే కొనసాగితే ‘పెద్ది’ మేకర్స్ థియేటర్ల యజమానులతో ఎలా ఒప్పందానికి వస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి పెద్ది చిత్రం సాధారణ టికెట్ రేట్లకే రిలీజ్ చేస్తారా లేక ఎగ్జిబిటర్స్ డిమాండ్‌కు ఓకే చెబుతారా అనేది వేచి చూడాలి.

Exit mobile version