‘అఖిల్’ రాకతో దీపావళి రేస్ మారిపోయింది..!

‘అఖిల్’ రాకతో దీపావళి రేస్ మారిపోయింది..!

Published on Nov 2, 2015 1:51 PM IST

akhil
అక్కినేని వంశంలో మూడో తరం నుంచి గ్రాండ్ ఎంట్రీకి ‘అఖిల్’ సినిమా ద్వారా అక్కినేని అఖిల్ సిద్ధమైన విషయం తెలిసిందే. దసరా కానుకగా విడుదల కావాల్సిన ఈ సినిమా, కొన్ని అనివార్య కారణాలతో వాయిదా పడింది. అప్పట్నుంచీ అఖిల్ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న నేపథ్యంలో ఎట్టకేలకు అఖిల్ టీమ్, దీపావళి కానుకగా సినిమాను విడుదల చేసేస్తున్నట్లు ప్రకటించేసింది. నాగార్జున స్వయంగా ఈ విషయాన్ని స్పష్టం చేయడంతో ఇక దీపావళి సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని విడుదలకు సిద్ధమైన సినిమాల రిలీజ్ డేట్లన్నింటిపై ఓ స్పష్టత వచ్చింది.

ఈ నవంబర్ 5వ తేదీ నుండే ‘త్రిష లేదా నయనతార’ సినిమాతో దీపావళి సినిమా సీజన్ మొదలవుతుంది. నవంబర్ 6న త్రిపుర సినిమా విడుదల కానుంది. ఇక దీపావళి వారమైన రెండో వారంలో నవంబర్ 11న అఖిల్ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. నవంబర్ 11నే కమల్ హీరోగా నటించిన క్రేజీ సినిమా చీకటి రాజ్యం విడుదల కానుంది. ఇక నవంబర్ 12న సల్మాన్ ఖాన్ నటించిన ప్రేమ్ రతన్ ధన్ పాయో సినిమా తెలుగు వర్షన్ ప్రేమలీల విడుదల కానుంది. అదేవిధంగా దీపావళి వారం ముగిసిన వారం తర్వాత నవంబర్ 20న భారీ అంచనాల మధ్యన ‘శంకరాభరణం’ సినిమా విడుదల కానుంది. ఇక ఈ నెలాఖర్లో నవంబర్ 27న రవితేజ హీరోగా నటించిన బెంగాల్ టైగర్, అదేరోజున అనుష్క నటించిన సైజ్ జీరో సినిమాలు విడుదల కానున్నాయి.

ఇక ఇప్పటివరకూ దీపావళి సీజన్‌లో ఏమేం సినిమాలు వస్తున్నాయా అనే అంశం ఇప్పటివరకూ అయోమయంగా కనిపించగా, తాజాగా అఖిల్ సినిమా రాకతో మిగతా సినిమా రిలీజ్ డేట్ల విషయంలో ఓ సూపర్ క్లారిటీ వచ్చి ఇప్పుడీ సీజన్‌కి ఓ కళ వచ్చింది. దసరా సీజన్‌లో రెండు పెద్ద హిట్‌లను ఇచ్చిన తెలుగు సినీ పరిశ్రమ, ఇప్పుడు ఈ దీపావళి సీజన్‌లో ఏమేం హిట్స్ ఇస్తుందనేది ఆసక్తికరమైన విషయం.

తాజా వార్తలు