ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై శ్రీకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిల్డ్రన్ మూవీ ‘సమ్మర్ హాలిడేస్’ నుంచి ‘స్కూల్ సాంగ్’ను చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో విడుదల చేసింది. మాస్టర్ రోహన్ రాయ్, మాస్టర్ అరుణ్, బేబి ఖుషి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో జయసుధ, రాజీవ్ కనకాల, వాసుకి కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ, స్టార్ నటీనటులతో సినిమాలు చేసినప్పటికీ చిన్నారులతో ఈ చిత్రం నిర్మించడం ఎంతో సంతృప్తినిచ్చిందని తెలిపారు. తొలుత అక్టోబర్ 2న చిత్రాన్ని విడుదల చేయాలని భావించినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఉన్న పోటీని దృష్టిలో ఉంచుకుని అక్టోబర్ నెలలోనే మరో అనువైన తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు.
దర్శకుడు శ్రీకర్ మాట్లాడుతూ, కుటుంబ ప్రేక్షకులతో పాటు పిల్లలందరికీ నచ్చేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దామని చెప్పారు. ఈ పాటకు సింజిత్ యెర్రమల్లి సంగీతం అందించగా, జీ సరిగమప విజేత విశ్వదత్తా ఆలపించారు. ఆట సందీప్ కొరియోగ్రఫీ సమకూర్చారు.


