రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ‘ధురంధర్ : ది రివెంజ్’ చిత్ర ట్రైలర్‌ను దర్శకుడు ఆదిత్య ధర్ విడుదల చేసిన కొద్ది గంటల్లోనే ఇంటర్నెట్‌లో ప్రభంజనం మొదలైంది. ట్రైలర్ లాంచ్‌తో పాటు, మార్చి 18న నిర్వహించనున్న పెయిడ్ ప్రివ్యూల కోసం మేకర్స్ అడ్వాన్స్ బుకింగ్‌లను కూడా ప్రారంభించారు. ఈ ట్రైలర్‌కు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద మరోసారి రికార్డులు తిరగరాయడం ఖాయమనిపిస్తోంది.
టికెట్ బుకింగ్స్ ప్రారంభమైన కేవలం కొన్ని గంటల్లోనే, పీవీఆర్, ఐనాక్స్ మరియు సినీపోలిస్ వంటి మల్టీప్లెక్స్ చైన్స్‌లో 40 వేలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. దీని ద్వారా సుమారు రూ.5 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి ఈ చిత్రం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. విశేషమేమిటంటే, ఇప్పటివరకు హైదరాబాద్‌లోనే అత్యధిక సంఖ్యలో టికెట్లు అమ్ముడయ్యాయి. ఇది నైజాం ప్రాంతంలో ఈ బాలీవుడ్ భారీ చిత్రం సృష్టించబోయే బాక్సాఫీస్ సునామీకి సంకేతంగా కనిపిస్తోంది.
ప్రస్తుతం నమోదవుతున్న ఈ లెక్కలు కేవలం పెయిడ్ ప్రివ్యూలకు మాత్రమేనని.. మొదటి రోజు మరియు వీకెండ్ బుకింగ్‌లు ఇంకా ప్రారంభం కావాల్సి ఉందని సమాచారం. అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్. మాధవన్ మరియు సారా అర్జున్ వంటి భారీ తారాగణంతో రూపొందిన ఈ చిత్రం మార్చి 19న హిందీ, తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
