‘బొమ్మరిల్లు’, ‘కొత్త బంగారు లోకం’.. ఈ రెండు సినిమాలు నిర్మాత దిల్‌రాజుకు ఎంత మంచి పేరు తెచ్చిపెట్టాయో చెప్పాల్సిన పనిలేదు. ఆ తర్వాత ఆయన నిర్మాణంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కినా పై రెండు సినిమాలు ఎప్పటికీ మరచిపోలేనివిగా చెప్పొచ్చు. ‘దిల్‌రాజు సినిమా అంటే ఇలా ఉంటుందీ’ అనే ఒక అభిప్రాయాన్ని, వాదాన్ని తెరపైకి తెచ్చిన సినిమాలుగా ఇవి నిలుస్తాయి. తాజాగా దిల్‌రాజు నిర్మిస్తోన్న ‘కేరింత’ ఆ స్థాయి సినిమాగా చెప్పబడుతుంది.
‘వినాయకుడు’, ‘విలేజ్‌లో వినాయకుడు’ వంటి సెన్సిబుల్ సినిమాలను తెరకెక్కించిన సాయికిరణ్ అడవి ‘కేరింత’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో సుమంత్ అశ్విన్ హీరోగా నటిస్తున్నారు. ఈమధ్యే విడుదలైన పోస్టర్స్, టైటిల్ సాంగ్ ప్రోమోలకు మంచి స్పందన వస్తోంది. త్వరలోనే ఈ సినిమా ఆడియో విడుదల కానుంది. ఇక మే నెలలో సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
టైటిల్ సాంగ్ విడుదల సందర్భంగా దిల్‌రాజు, తమ సంస్థ స్థాయిని పెంచే సినిమాగా కేరింత నిలవనుందని, బొమ్మరిల్లు, కొత్త బంగారులోకం సినిమాల సరసన కేరింత నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక దిల్‌రాజు తాజాగా ‘ఓకే కన్మణి’ తెలుగు వర్షన్ ‘ఓకే బంగారం’ను తెలుగులో విడుదల చేసి మంచి విజయాన్ని సొంత చేసుకున్న విషయం తెలిసిందే.


