ఓటీటీ నుంచి ‘సత్లుజ్’ మూవీని ఎందుకు డిలీట్ చేశారు? దిల్జీత్ దోసాంజ్ సినిమాపై కేంద్రం సీరియస్, అసలు కారణమిదే!

ఓటీటీ నుంచి ‘సత్లుజ్’ మూవీని ఎందుకు డిలీట్ చేశారు? దిల్జీత్ దోసాంజ్ సినిమాపై కేంద్రం సీరియస్, అసలు కారణమిదే!

Published on Jul 7, 2026 2:30 PM IST

ముఖ్య అంశాలు

  • రూల్స్ బ్రేక్ చేసిన మేకర్స్: సెన్సార్ బోర్డు సూచించిన మార్పులను, కట్స్‌ను పక్కన పెట్టి, గుట్టుచప్పుడు కాకుండా కొత్త టైటిల్‌తో జీ5 (ZEE5) ఓటీటీలో నేరుగా విడుదల చేయడంపై కేంద్రం సీరియస్ అయింది.
  • భద్రతా కారణాలతోనే యాక్షన్: ఐటీ రూల్స్ 2021 (డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) ప్రకారం, దేశ భద్రత మరియు బాధ్యతాయుత అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ సినిమాను వీక్షణకు అందుబాటులో లేకుండా తక్షణమే తొలగించాలని కేంద్రం ఆదేశించింది.
  • నిజ జీవిత కథ ఆధారంగా: పంజాబ్‌కు చెందిన ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త ‘జస్వంత్ సింగ్ ఖల్రా’ నిజ జీవితం ఆధారంగా, నటుడు దిల్జీత్ దోసాంజ్ ప్రధాన పాత్రలో ఈ చిత్రం తెరకెక్కింది.

ప్రముఖ పంజాబీ స్టార్, సింగర్ దిల్జీత్ దోసాంజ్ లీడ్ రోల్‌లో నటించిన ‘సత్లుజ్’ చిత్రం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఎన్నో వివాదాల మధ్య జులై 3న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘జీ5’లో స్ట్రీమింగ్‌కు వచ్చిన ఈ సినిమా.. కేవలం రెండు రోజులకే డిజిటల్ స్క్రీన్స్ నుంచి అకస్మాత్తుగా మాయమైపోయింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా సినిమాను ఓటీటీ నుంచి డిలీట్ చేయడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే, అసలు ఈ సినిమాను ఎందుకు తొలగించాల్సి వచ్చిందనే దానిపై కేంద్ర ప్రభుత్వ అధికార వర్గాలు పూర్తి స్పష్టతనిచ్చాయి.

దేశ భద్రత, బాధ్యతాయుతమైన డిజిటల్ కంటెంట్ అంశాలను దృష్టిలో పెట్టుకునే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర వర్గాలు వెల్లడించాయి. ఐటీ చట్టంలోని డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ రూల్స్ 2021 (పార్ట్-3) ప్రకారం ‘సత్లుజ్’ సినిమాను ప్లాట్‌ఫామ్ నుంచి తీసేయాలని సదరు ఓటీటీ సంస్థకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. సెన్సార్ బోర్డు సూచనలను చిత్ర బృందం పూర్తిగా పక్కన పెట్టేసిందని, థియేటర్లలో కాకుండా గుట్టుచప్పుడు కాకుండా కొత్త టైటిల్‌తో నేరుగా ఓటీటీలో రిలీజ్ చేశారని ప్రభుత్వం గుర్తించింది. ప్రస్తుతం ఓటీటీ కంటెంట్ అనేది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) పరిధిలోకి రాదు. దీనిని ఆసరాగా చేసుకుని నిబంధనలకు విరుద్ధంగా స్ట్రీమింగ్‌కు తీసుకురావడంతో, కేంద్ర సమాచార శాఖ జీ5 సంస్థకు నోటీసులు పంపి, వీక్షణకు అందుబాటులో లేకుండా తక్షణమే తొలగించాలని కోరింది.

నాలుగేళ్ల వివాదం.. అసలు కథేంటంటే?

ఈ సినిమా చుట్టూ వివాదాలు నడవడం ఇప్పుడే కొత్తేమీ కాదు. పంజాబ్‌కు చెందిన ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త జస్వంత్ సింగ్ ఖల్రా జీవిత కథ ఆధారంగా హనీ టెహ్రన్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. మొదట ఈ సినిమాకు ‘పంజాబ్ 95’ అనే టైటిల్ పెట్టారు. అప్పట్లోనే ఈ సినిమాను పరిశీలించిన సెన్సార్ బోర్డు ఏకంగా 127 కట్స్ చెప్పడమే కాకుండా, టైటిల్ కూడా మార్చాలని కండిషన్ పెట్టింది. అయితే ఇన్ని మార్పులు చేస్తే సినిమా ఒరిజినల్ కథ దెబ్బతింటుందని మేకర్స్ అప్పట్లో కోర్టును కూడా ఆశ్రయించారు. నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్ట్‌ను, చివరకు ‘సత్లుజ్’ అనే పేరుతో డైరెక్ట్‌గా ఓటీటీలోకి తీసుకొచ్చారు.

ఈ తొలగింపు వ్యవహారంపై పంజాబ్‌లోని పలు రాజకీయ పార్టీలతో పాటు ‘శిరోమణి గురుద్వార ప్రబంధక్ కమిటీ’ (SGPC) కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ సినిమాను వెంటనే ఓటీటీలో రీ-రిలీజ్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు హీరో దిల్జీత్ దోసాంజ్ స్పందిస్తూ.. ఈ మూవీ ఎక్కడ, ఏ రూపంలో లభ్యమైతే ఆ విధంగా కచ్చితంగా చూడాలంటూ ప్రేక్షకులను కోరడం విశేషం. చిత్ర బృందం ఒకవేళ ఈ సినిమాను అధికారికంగా విడుదల చేయాలనుకుంటే, థియేటర్ మరియు ఓటీటీకి సంబంధించిన నియమ నిబంధనలను పక్కాగా పాటించి ప్రొసీడ్ అవ్వచ్చని కేంద్ర అధికార వర్గాలు స్పష్టం చేశాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు