దిల్ రాజు కేసు విషయంలో స్పందించిన దర్శకుడు !


ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ‘మి.పర్ఫెక్ట్’ చిత్రం తన నవల ‘నా మనసు నిన్ను కోరి’ లోని కథను కాపీ చేసి తీశారని రచయిత శ్యామలారాణి కొన్నిరోజుల క్రితం మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు వేసిన సంగతి తెలిసిందే. పోలీసులు కూడా 120ఏ, 415 మరియు 420 సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. అయితే ఈ వివాదంపై దిల్ రాజుగారు ఇంకా స్పందించలేదు.

కానీ ‘మి. పర్ఫెక్ట్’ చిత్ర దర్శకుడు దశరథ్ మాత్రం స్పందించారు. దశరథ్ రాతపూర్వక వివరణ ఇస్తూ ‘శ్యామలారాణిగారి నవల నా మనసు నిన్ను కోరి 2010 ఆగష్టులో రిలీజ్ చేశారు. కానీ అంతకంటే ముందే 2009 మి. పర్ఫెక్ట్ కథని నవ్వుతూ అనే టైటిల్ తో రైటర్స్ యూనియన్లో రిజిస్టర్ చేయించాం. 2008 డిసెంబర్లో ఈ కథను నేను, దిల్ రాజుగారు ప్రభాస్ కు చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని రైటర్స్ యూనియన్ ప్రెసిడెంట్ గోపాలకృష్ణగారు శ్యామలారాణికగారికి వివరించడం జరిగింది. అయినా ఆమె అర్థం చేసుకోవడంలేదు. ఇప్పటికైనా ఆమె నిజాలను గ్రహించాలని కోరుతున్నాను’ అన్నారు. మరి దశరథ్ వివరణకు శ్యామలారాణిగారు ఎలాంటి బదులిస్తారో, ఈ వివాదం ఎలా ,ముగుస్తుందో చూడాలి.