తండ్రి మాట నిలబెడుతూ దేవిశ్రీ ఇచ్చిన గొప్ప నివాళి

తండ్రి మాట నిలబెడుతూ దేవిశ్రీ ఇచ్చిన గొప్ప నివాళి

Published on Dec 18, 2015 11:20 AM IST

devi-sri-prasad
దేవిశ్రీ ప్రసాద్.. ప్రస్తుతం తెలుగులో టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా అభిమానుల మన్ననలు పొందుతూ దూసుకుపోతోన్న రాకింగ్ స్టార్. యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించిన ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఈమధ్యే తన తండ్రిని కోల్పోయి తీవ్ర శోకంలో మునిగిపోయారు. రచయితగా ఎంతో పేరు సంపాదించిన దేవిశ్రీ తండ్రి సత్యమూర్తి రెండు రోజుల క్రితం హార్ట్ ఎటాక్‍‌తో మరణించారు. ఆయన మరణం పట్ల సినీ పరిశ్రమ సంతాపం వ్యక్తం చేయడంతో పాటు దేవిశ్రీకి అండగా కూడా నిలబడింది.

ఇక తనకు ఎంతో ఇచ్చిన మ్యూజిక్ కోసం, సినిమా కోసం, తండ్రి మాటను నిలబెట్టేందుకు దేవిశ్రీ తీసుకున్న ఓ నిర్ణయం వృత్తి పట్ల ఆయనకున్న అంకితభావాన్ని మరోసారి ప్రపంచానికి చూపింది. ప్రస్తుతం దేవిశ్రీ ‘నాన్నకు ప్రేమతో’ అన్న సినిమాకు పని చేస్తోన్న విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఈమధ్యే వేగవంతం అయ్యాయి. కాగా అకస్పాత్తుగా దేవిశ్రీ తండ్రి మరణించడంతో, మ్యూజిక్ పనులు వాయిదా పడనున్నాయని, దీంతో సినిమా కూడా వాయిదా పడనుందనే వార్తలు వచ్చాయి.

కాగా ఈ వార్తలన్నింటిలో ఏమాత్రం నిజం లేదని నాన్నకు ప్రేమతో పనుల్లో జాయినైపోయి దేవిశ్రీ స్పష్టం చేసినట్లైంది. “నాన్న ఎప్పుడూ వర్క్ ఫస్ట్ అని చెబుతూండేవారు. ఆయన నేర్పిన బాటలోనే ‘నాన్నకు ప్రేమతో’ పనులు పూర్తి చేస్తున్నా” అని దేవిశ్రీ తెలిపారు. ఇక సినిమా కోసం, నాన్న మాటను నిలబెడుతూ దేవిశ్రీ తీసుకున్న ఈ నిర్ణయం అతడి అంకిత భావానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. దేవిశ్రీ అతడి తండ్రి సత్యమూర్తికిచ్చే గొప్ప నివాళిగా ఈ అంశాన్ని చూడొచ్చు.

తాజా వార్తలు