తమిళనాడులో ఎన్నికల పర్వం మొదలుకానుంది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో అక్కడి రాజకీయ పార్టీలు తమ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాయి. అభ్యర్థుల ఎంపిక, పార్టీలతో పొత్తు వంటి అంశాలపై రాజకీయ పార్టీలు జోరుగా పనిచేస్తున్నాయి. అయితే, ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త వహిస్తున్నారు. పోలీసులు చెక్ పోస్టులు పెట్టి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
కాగా, ఈ తనిఖీల్లో భాగంగా చెన్నై అశోక్‌నగర్ 2వ అవెన్యూలో ఓ మినీ వ్యాన్‌ను ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీ చేసింది. అందులో ఏకే-47 రకం సహా 10 తుపాకులు ఉండటంతో అధికారులు సదరు వ్యాన్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా ఆ తర్వాతే ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్‌కు సినిమా రేంజ్లో ఓ ట్విస్ట్ తగిలింది. ఆ వ్యాన్ డ్రైవర్ ఇచ్చిన వివరాల ప్రకారం అవి డమ్మీ తుపాకులు అని తేలింది.
లోకేశ్ కనగరాజ్ నటిస్తున్న ‘డీసీ’ చిత్రం కోసం ఆ డమ్మీ తుపాకులను అద్దెకు తీసుకొచ్చారని.. షూటింగ్ ముగిశాక వాటిని తిరిగి ఇచ్చేందుకు తీసుకెళ్తున్నట్లు సదరు వ్యాన్ డ్రైవర్ తెలిపాడు. దీంతో ఖంగుతిన్న ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు ఆ డ్రైవర్‌ను వదిలేశారు. ప్రస్తుతం ఈ విషయం తమిళనాట వైరల్ అవుతోంది.


