మహేష్ – కొరటాల సినిమాకు టైటిల్ ఫిక్స్!?

Mahesh-Babu-Koratala-Shiva
సూపర్ స్టార్ మహేష్ – దర్శకుడు కొరటాల శివల కాంబినేషన్‌లో వచ్చిన ‘శ్రీమంతుడు’ అనే సినిమా ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పుడిదే కాంబినేషన్‌లో రెండో సినిమా గత నెలలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జనవరిలో సెట్స్‌పైకి వెళ్ళనున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాకు టైటిల్ ఏమై ఉంటుందన్న దానిపై కూడా ఇప్పటికే చాలా ఊహాగానాలు వినిపించాయి.

వాటిల్లో ‘భరత్ అనే నేను’ టైటిల్ బాగా పాపులర్ అయింది. ఇదే టైటిల్ ఖరారు కావొచ్చని బాగా వినిపించింది. తాజాగా ఈ సినిమాను నిర్మిస్తోన్న డీవీవీ దానయ్య సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్‌ఛాంబర్‌లో ఇదే పేరును రిజిష్టర్ చేయించడం విశేషంగా చెప్పుకోవాలి. నిర్మాణ సంస్థ ఈ పేరును రిజిస్టర్ చేయించిందంటే తప్పకుండా సినిమాకు ఇదే టైటిల్ అనుకుంటారని ఊహించొచ్చు. రవి కే.చంద్రన్, దేవిశ్రీ ప్రసాద్ లాంటి టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తోన్న ఈ సినిమాకు కొరటాల శివ ఓ కొత్త హీరోయిన్‌ను ఎంపిక చేసే పనిలో ఉన్నారు.