సమీక్ష : “ఈగల్” – కొన్ని చోట్ల మెప్పించే వైల్డ్ యాక్షన్ డ్రామా !

సమీక్ష : “ఈగల్” – కొన్ని చోట్ల మెప్పించే వైల్డ్ యాక్షన్ డ్రామా !

Published on Feb 10, 2024 3:03 AM IST
Eagle Movie Review in Telugu

విడుదల తేదీ : ఫిబ్రవరి 09, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: రవితేజ, కావ్య థాపర్,అనుపమ పరమేశ్వరన్, వినయ్ రాయ్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల, అజయ్ ఘోష్ తదితరులు

దర్శకుడు : కార్తీక్ ఘట్టమనేని

నిర్మాత: టి జి విశ్వ ప్రసాద్

సంగీత దర్శకులు: డావ్ జాన్డ్

సినిమాటోగ్రాఫర్‌లు: కార్తీక్ ఘట్టమనేని, కర్మ్ చావ్లా, కమిల్ ప్లాకి

ఎడిటింగ్: కార్తీక్ ఘట్టమనేని

సంబంధిత లింక్స్: ట్రైలర్

మాస్ మహారాజా రవితేజ హీరోగా కావ్య థాపర్ హీరోయిన్ గా కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన చిత్రం ఈగల్. ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్ష లోకి వెళ్ళి చూద్దాం.

కథ :

ఆంధ్రప్రదేశ్ మదనపల్లి తాలూకాలో ఉన్న తలకోన అటవీ ప్రాంతానికి చెందిన ఒక గిరిజన తండాలో సహదేవ వర్మ (రవితేజ ) విగ్రహాన్నిపెట్టుకొని అతన్ని దేవుడిలా కొలుస్తూ ఉంటారు. ఐతే, జర్నలిస్ట్ నళిని రావు (అనుపమ) అనుకోకుండా ఒక స్పెషల్ కాటన్ క్లాత్ చూసి, ఆ క్లాత్ పండే ఊరికి సంబంధించి ఓ ఆర్టికల్ రాస్తోంది. దాంతో సీబీఐ రంగంలోకి దిగి సదరు పత్రిక మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటుంది. ఇంతకీ, సహదేవ వర్మకి ఆ కాటన్ క్లాత్ కి ఉన్న సంబంధం ఏమిటి ?, ఇంతకీ, ఈ సహదేవ్ వర్మ ఎవరు ?, ఎందుకు అతని గురించి పేపర్లో రాస్తే సీబీఐ రంగంలోకి దిగింది ?, అసలు సహదేవ్ భార్య రచన (కావ్య థాపర్)కి ఏమైంది ?, ఈ మొత్తం వ్యవహారంలో ఈగల్ ఎవరు ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

‘ఈగల్’ అనే పాత్రలో రవితేజ చాలా పవర్ ఫుల్ గా కనిపించాడు. వైల్డ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషన్స్ తోనూ రవితేజ మెప్పించాడు. ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ.. రవితేజ నటించిన విధానం ఆకట్టుకుంది. పైగా తన బాడీ లాంగ్వేజ్ తో అలాగే, కొన్ని యాక్షన్ అండ్ ఎమోషనల్ సీక్వెన్సెస్ లో మరియు తన స్టైలిష్ లుక్స్ తో రవితేజ చాలా బాగా నటించాడు. కావ్య థాపర్ తో సాగిన లవ్ స్టోరీలోనూ రవితేజ ఆకట్టుకున్నాడు.

హీరోయిన్ గా కావ్య థాపర్ మెప్పించింది. బరువైన భావోద్వేగ సన్నివేశాల్లో కూడా ఆమె చాలా సెటిల్డ్ గా నటిస్తూ ఆకట్టుకుంది. కీలక పాత్రలో నటించిన అనుపమ పరమేశ్వరన్ కూడా మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన నవదీప్ కూడా బాగానే నటించాడు. వినయ్ రాయ్ యాక్టింగ్ పరంగా గత తన చిత్రాల్లో కంటే ఈ చిత్రంలో చాలా బాగా నటించాడు. శ్రీనివాస్ అవసరాల, మధుబాల, అజయ్ ఘోష్ అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు.

ముఖ్యంగా అజయ్ ఘోష్ కొన్ని చోట్ల బాగా నవ్వించాడు. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని రాసుకున్న యాక్షన్ ఎపిసోడ్స్ అండ్ ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. ముఖ్యంగా రవితేజ అభిమానులను దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కించాడు.

మైనస్ పాయింట్స్ :

ఈగల్ పాత్రను, ఆ పాత్ర తాలూకు ప్లాష్ బ్యాక్ ను బాగా డిజైన్ చేసుకున్న కార్తీక్ ఘట్టమనేని, అంతే స్థాయిలో ఈ ఈగల్ సినిమా ట్రీట్మెంట్ ను రాసుకోలేదు. ముఖ్యంగా ఆసక్తికరంగా కథనాన్ని రాసుకోవడంలో ఆయన విఫలం అయ్యారు. చాలా సన్నివేశాలు స్లోగా మరియు రెగ్యులర్ గా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. పైగా కొన్ని సన్నివేశాలు మినహా ఎక్కడా ఫ్రెష్ నెస్ కనిపించదు.

అలాగే, ఫస్ట్ హాఫ్ ను వేగంగా నడిపిన దర్శకుడు సెకండాఫ్ ని మాత్రం మరీ సాగతీశారు. ఒక్క క్లైమాక్స్ లో తప్ప మిగిలిన కథనంలో ఉత్సుకతను పెంచటంలో విఫలమయ్యారు. కథనాన్ని ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నప్పటికీ, కార్తీక్ ఘట్టమనేని మాత్రం తన శైలిలోనే సినిమాని ముగించారు. ఇక కథను మలుపు తిప్పే ప్రదాన పాత్ర అయిన ‘కావ్య థాపర్’ పాతను ఇంకా బలంగా ఎస్టాబ్లిష్ చేసి.. అంతే ఎఫెక్టివ్ గా ఆ పాత్రకి ముగింపు ఇవ్వాల్సింది.

సాంకేతిక విభాగం :

దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని కొన్ని సన్నివేశాలను యాక్షన్ పరంగా అలాగే ఎమోషనల్ గా బాగా తెరకెక్కించినప్పటికీ.. తీసుకున్న స్టోరీ లైన్ కి పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా ఆయన ఈగల్ స్క్రీన్ ప్లేను రాసుకోలేకపోయారు. సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సంగీత దర్శకుడు అందించిన పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను చాలా బ్యూటిఫుల్ గా చిత్రీకరించారు. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే.. అక్కడక్కడ ఉన్న కొన్ని సాగతీత సీన్స్ ను ఎడిటర్ తగ్గించాల్సింది. నిర్మాత టి జి విశ్వప్రసాద్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయన నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.

తీర్పు :

‘ఈగల్’ అంటూ భారీ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రంలో రవితేజ నటన మరియు యాక్షన్ సీన్స్, అలాగే రవితేజ పాత్ర తాలూకు ఎలివేషన్స్ అండ్ ఎమోషన్స్ బాగున్నాయి. క్లైమాక్స్ కూడా ఆకట్టుకుంది. ఐతే, సినిమాలో బలమైన ఎమోషన్, కాన్ ఫ్లిక్ట్ ఉన్నప్పటికీ… ఆ ఎమోషన్ లో, ఆ కాన్ ఫ్లిక్ట్ లో ప్రేక్షకుడు పూర్తి స్థాయిలో ఇన్ వాల్వ్ అయ్యేంతగా.. అవి సరిగ్గా ఎస్టాబ్లిష్మెంట్ కాలేదు. ఓవరాల్ గా ఈ సినిమాలో రవితేజ నటనతో పాటు పవర్ ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ బాగా ఆకట్టుకుంటాయి.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

Eagle Telugu Movie Review, Eagle Movie Reviews and Ratings, Ravi Teja, Anupama Parameshwaran, Kavya Thapar, Eagle Movie Review, Eagle Review, Eagle movie Ratingసమీక్ష : "ఈగల్" - కొన్ని చోట్ల మెప్పించే వైల్డ్ యాక్షన్ డ్రామా !