ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ : కమెడియన్ సత్య – రాజమౌళి సర్ అభినందనలు ఏప్పటికీ గుర్తుంటాయి.

Published on Apr 21, 2020 12:16 pm IST

లాక్ డౌన్ ఇంటర్వ్యూ సిరీస్ ను కొనసాగిస్తూ, ఈ రోజు, సూపర్ టాలెంటెడ్ అండ్ క్రేజీ కమెడియన్ సత్యతో ప్రత్యేకమైన ఇంటర్వ్యూను మీకు అందిస్తున్నాము. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ను మొదలుపెట్టి.. మంచి కామెడీ టైమింగ్ తో తెలుగు ప్రేక్షకుల పై నవ్వుల వెదజల్లులు కురిపిస్తున్న ఈ యంగ్ కమెడియన్ తనకు దక్కిన ప్రజాదరణ గురించి, తన భవిష్యత్తు ప్రణాళికల గురించి మాతో వివరణాత్మకంగా ముచ్చటించాడు. ఆ విశేషాలు మీకోసం…

 

హాయ్ సత్యగారు. ఈ లాక్ డౌన్ సమయంలో ఏమి చేస్తున్నారు. ఇంతకీ ఈ పరిస్థితులను ముందే ఊహించారా ?

ఈ కరోనా మహమ్మారి వల్ల పరిస్ట్గ్హుతులు మరింత దిగజారిపోతాయని మనకు ముందే ఒక ఆగాహన వచ్చేసింది. వేరే కంట్రీస్ లోని పరిస్థితులు వల్ల మనకు జాగ్రత్త పడే అవకాశం కూడా వచ్చింది. అందుకే నా కుటుంబాన్ని నా స్వస్థలమైన అమలాపురానికి తీసుకువచ్చాను. నా కుటుంబంతో నేను కోల్పోయిన కొంత నాణ్యమైన సమయాన్ని ఈ ఖాళీ సమయంలో పూర్తిగా ఆస్వాదిస్తున్నాను.

 

పూర్తిగా ఇంటికే పరిమితం అవ్వాల్సిన స్థితి. మరి ఇంట్లో కొత్తగా ఏమి చేస్తున్నారు?

నేను పెద్ద ఫుడ్ లవర్ ని, తినడంతో పాటు వండడానికి కూడా ఇష్టపడతాను. ఈ ఖాళీ సమయాన్ని ఫుడ్ కోసమే కేటాయించాను. పూర్తిగా చెఫ్‌గా మారి, నా కుటుంబం కోసం అన్ని రకాల రుచికరమైన వంటలను చేస్తున్నాను. ఇదొక బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఎక్స్ పీరియన్స్.

 

మీ ఫ్యామిలీ కోసం మీరు ప్రత్యేకంగా చేసే ఫుడ్ ఐటమ్ ఏమిటి ?

ప్రత్యేకంగా అంటే.. మా ప్రాంతం సీ ఫుడ్‌ కు ప్రసిద్ధి. నేను చేపలు రొయ్యలను వండటానికే ఎక్కువ ఇష్టపడతాను. ప్రస్తుతం వాటినే డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ లో చేయడానికి ప్రయత్నిస్తున్నాను. తిన్నవాళ్ళు అందరూ టేస్ట్ కూడా బాగుంది అంటున్నారు.

 

మీరు ఇండస్ట్రీకి వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. ఎందుకు మీరు ఇంకా ఎక్కువుగా లో ప్రొఫైల్‌ నే మెయింటైన్ చేస్తారు ?

(నవ్వుతూ) హై ప్రొఫైల్‌ నే మెయింటైన్ చేయలేక. నిజానికి అది నా స్వభావం అండి. అయితే కెమెరా ముందుకు వచ్చిన తర్వాత మాత్రం, నేను అన్నింటినీ మరచిపోయి పూర్తిగా చేస్తున్న పాత్రలోకి లీనమైపోయి నటిస్తాను. అయినా నేను హై ప్రొఫైల్‌ ను మెయింటైన్ చేయడానికి నేను ఇంకా ఒక ప్రముఖుడి హోదాను ఏమి పొందలేదు. ప్రస్తుతానికి అయితే నా పనితో నేను సంతోషంగా ఉన్నాను. ఇక మిగతావి అన్ని నేను పెద్దగా పట్టించుకోను.

 

అసలు మీరు సినిమాల్లోకి ఎలా వచ్చారు. మీరు మొదట అసిస్టెంట్ డైరెక్టర్‌ కదా ?

సినిమాల్లోకి రావడానికి కారణం సినిమాల మీద ఇంట్రస్టే. రకరకాల ప్రయత్నాలు తరువాత నితిన్ ‘ద్రోణ’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌ గా పని చేసే అవకాశం వచ్చింది. ఆ సినిమా దర్శకుడు మరియు నితిన్ నేను నటించగలనని భావించడంతో ఆ విధంగా నా కెరీర్‌ మొదలైంది..

 

మీ జర్నీలో మీకు మొదటి సక్సెస్ ఎప్పుడు వచ్చింది ?

ఐదేళ్ళు కష్టపడ్డాక, స్వామి రారా సినిమాలో నా నటనకు మంచి పేరు వచ్చింది. అప్పట్లో ఆ సినిమానే నాకు పెద్ద సక్సెస్. ఆ తరువాత నారా రోహిత్ ‘రౌడీ ఫెలో’ కూడా. అప్పటి నుండి, నాకు కొన్ని మంచి పాత్రలు వచ్చాయి, ఆలా ‘ఛలో’ సినిమా కూడా నాకు పెద్ద సక్సెస్. అప్పటి నుండి ఛాన్స్ లు కోసం ఎదురు చూడాల్సిన పనిలేకుండా పోయింది.

 

అసిస్టెంట్ డైరెక్టర్‌ గ పనిచేశారు. మరి మీరు భవిష్యత్తులో దర్శకత్వం చేస్తారా ?

చేస్తాను. కాకపోతే, నేను నటుడిగా ఇంకా పూర్తిగా ఎదిగిన తరువాత, అలాగే ఆర్ధికంగా కూడా సరిగ్గా స్థిరపడిన తరువాత, ఖచ్చితంగా దర్శకత్వం గురించి ఆలోచిస్తాను. ప్రస్తుతానికి నటన మీదే నా దృష్టి అంతా. భవిష్యత్తులో నేను మంచి క్యారెక్టర్ యాక్టర్ గా మారాలనుకుంటున్నాను.

 

ఇప్పటివరకూ మీకు దక్కిన ఉత్తమ అభినందన ఏమిటి అంటే.. ఏమి చెబుతారు ?

వైజాగ్‌లో ఓ చిత్రం షూటింగ్ చేస్తుండగా.. ఒక పెద్దావిడ వచ్చి నన్ను గట్టిగా కౌగిలించుకుని, మీ నటనను బాగా ఇష్ట పడతాను, మీ ప్రతి సినిమా చూస్తాను అని చెప్పారు. ఆ పెద్దావిడ నా పట్ల చూపిన అభిమానం నా జీవితంలో నాకు దక్కిన నాకు నచ్చిన అతి పెద్ద పొగడ్త.

 

టాలీవుడ్‌లో సీనియర్ హాస్యనటులు మీతో ఎలా ఉంటారు. మిమ్మల్ని ఎలా చూస్తారు?

అందరితో నాకు మంచి సంబంధం ఉంది. అందరూ నన్ను ప్రేమిస్తారు. నేను బ్రహ్మానందంగారికి పెద్ద అభిమానిని. అలాగే వెన్నెల కిశోర్ మరియు రావు రమేష్ గార్లతో కూడా సన్నిహితంగా ఉంటాను. నటుడు అజయ్ కూడా చాలా కాలంగా నాకు మంచి స్నేహితుడు.

 

మీరు ఏ దర్శకులతో పనిచేయాలని ఆశగా ఎదురు చూస్తున్నారు ?

నేను ఇప్పటికే మంచి మంచి దర్శకులతో కలిసి పని చేశాను, చేస్తున్నాను. అయితే రాబోయే రోజుల్లో పూరిగారితో, త్రివిక్రమ్ మరియు రాజమౌళి సర్ దర్శకత్వంలో నటించాలని ఉంది. మత్తు వదలరా సినిమాలో నా పాత్రకు రాజమౌళి సర్ ఇచ్చిన అభినందనలు నాకు ఏప్పటికీ గుర్తుంటాయి.

 

మీకు ఇష్టమైన హీరోలు ?

నేను చిరంజీవి సర్ కి అతి పెద్ద అభిమానిని. ఒకవిధంగా నేను సినిమాల్లోకి రావడానికి కారణం కూడా ఆయనే. ఇప్పటికి నాకు పెద్ద ప్రేరణ మెగాస్టారే. అలాగే, నేను రజనీకాంత్ అభిమానిని కూడా. ఆయన సినిమాలను కూడా ఇష్టంగా చూస్తాను.

 

మీ తదుపరి సినిమాల గురించి ?

హీరో రామ్ రెడ్ సినిమాలో నేను మంచి కీలక పాత్ర చేసాను. అలాగే సాయి తేజ్ సోలో బతుకే సో బెటర్, శ్రీకారం, మరియు గల్లా జయదేవ్ తొలి చిత్రంలో కూడా నటిస్తున్నాను. అంటూ సత్య ఇంటర్వ్యూను ముగించారు.

 

సంబంధిత సమాచారం :

X
More