సమీక్ష : ఫలక్ నూమా దాస్ – మాస్ ప్రేక్షకులకు మాత్రమే !

Published on Jun 1, 2019 4:02 am IST

విడుదల తేదీ : మే 31, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ :  2.75/5

నటీనటులు : విశ్వక్‌ సేన్‌, హర్షిత గౌర్, సలోని మిశ్రా, తరుణ్ భాస్కర్, ఉత్తేజ్, ప్రశాంతి చౌరోలింగం తదితరులు.
దర్శకత్వం : విశ్వక్ సేన్

నిర్మాత : కరాటీ రాజు

సంగీతం : వివేక్ సాగర్

సినిమాటోగ్రఫర్ : విద్యా సాగర్

ఎడిటర్ :  రవితేజ


‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన విశ్వక్‌ సేన్‌ దర్శకుడిగా మారి ‘ఫలక్ నుమా దాస్’ చిత్రాన్ని తెరకెక్కించాడు. టీజర్, ట్రైలర్ లతో అంచనాలు పెంచుకున్న ఈ సినిమా ఈ రోజు విడుదల అయింది. కాగా ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ :

ఫలక్ నుమా ఏరియాలో
పుట్టి పెరిగిన దాస్ (విశ్వక్‌ సేన్‌) అదే ఏరియాలోని శంకరన్న అనే వ్యక్తిని చూసి.. ప్రేరణ పొంది చిన్నప్పడే అతనిలా ఓ గ్యాంగ్ పెట్టాలని నిర్ణయించుకుంటాడు. అలా ఒక గ్యాంగ్ తయారుచేసుకుని చిన్న చిన్న గొడవలతో అలాగే టినాతో ఆ తరువాత సఖితో ప్రేమలో మునిగి తెలుతుండగా.. సడెన్ గా శంకరన్నని చంపేస్తారు. దాంతో దాస్ ఆ చంపిన వాళ్లను పట్టుకుని పొలీస్ లకు పట్టిస్తాడు. ఆ తరువాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం దాస్ ఓ హత్య కేసులో ఇరుక్కుంటాడు. ఈ క్రమంలో దాస్ ఆ కేసు నుండి బయట పడటానికి ఏమేమి పనులు చేసాడు ? ఈ క్రమంలో తన జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలు ఏమిటి ? ఇంతకీ దాస్ ఆ కేసు నుండి బయటపడ్డాడా ? లేదా ? చివరికి దాస్ గ్యాంగ్ లైఫ్ లో సెటిల్ అయ్యారా ? లేదా ? లాంటి విషయాలు తెలియాలంటే వెండితెర పై ఈ చిత్రం చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

‘ఫలక్ నుమా దాస్’ రీమేక్ మూవీ అయినప్పటికీ, అసలు ఎక్కడా రీమేక్ మూవీ అనే భావనే కలగకుండా.. మన నేటివిటీకి తగ్గట్టుగా సినిమాలో చేసిన మార్పులు చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా నేపధ్యాన్ని హైదరాబాద్ పాతబస్తీ పరిసరాలకు మార్చడం సినిమాకి బిగ్ ప్లస్ పాయింట్ అయింది.
ఇక ఫలక్ నుమా దాస్ చిత్రంలోని డైలాగ్స్, టేకింగ్, నటీనటుల నటన ప్రధానంగా తరుణ్ భాస్కర్, విశ్వక్ సేన్ నటన సినిమాలోనే హైలెట్ గా నిలుస్తాయి.

ఈ సినిమాలో హీరోగా నటించిన విశ్వక్‌ సేన్‌ ఎమోషనల్ సన్నివేశాలతో పాటు యాక్షన్ సీన్స్ లో కూడా చాలా బాగా నటించాడు. తన నటనతో పాటు డైలాగ్ మాడ్యులేషన్ తో కూడా విశ్వక్‌ సేన్‌ ఆకట్టుకుంటాడు. ఇక హీరోయిన్స్ గా నటించిన హర్షిత గౌర్ అండ్ సలోని తమ గ్లామర్ తోనే కాకుండా.. తమ నటన పరంగా కూడా బాగా చేసారు. ఇక ‘యస్.ఐ’గా నటించిన తరుణ్ భాస్కర్ సినిమాలో కనిపించనంతసేపూ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.

ఇక ఈ సినిమాలో ప్రేమ, డబ్బు మరియు ఫ్రెండ్షిప్ తాలూకు ఎమోషన్స్ వంటి సున్నితమైన అంశాలను వాటి వల్ల పడే ఇబ్బందలను చాలా వాస్తవికంగా చూపించటం ఆకట్టుకుంటుంది. పైగా సినిమా చివరకి వచ్చేసరికి పాత్రలకు ఏం జరుగుతుందో అనే ఉత్సుకతను దర్శకుడు బాగా మెయిటైన్ చేశాడు.

మైనస్ పాయింట్స్ :

విశ్వక్‌ సేన్‌ కథ, పాత్రల పరంగా మంచి పనితీరుని కనబర్చినప్పటికీ.. కథను మొదలు పెట్టడంలో మాత్రం చాలా నెమ్మదిగా కనిపించారు. దర్శకుడు పాత్రలు పరిచయానికి చాలా సమయం తీసుకున్నారు. పైగా సెకెండ్ హాఫ్ బాగా స్లోగా సాగడం, రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం, కొన్ని చోట్ల పేలవమైన కథనం, క్లైమాక్స్ ఎక్కువ సేపు సాగడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్లుగా నిలిచాయి.

ఇక చాలావరకు నూతన నటినటులతోనే సినిమాని తెరకెక్కించడం ఈ సినిమా ఫలితాన్ని కొంతవరకు దెబ్బతీస్తుందనే చెప్పాలి. పైగా ఎలాంటి కమర్షియల్ హంగులు ఆర్భాటాలు లేకపోవడంతో, రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ కి అలవాటు పడ్డ ప్రేక్షకులను ఈ చిత్రం ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి.

సాంకేతిక విభాగం :

విశ్వక్‌ సేన్‌ దర్శకుడిగా రచయితగా ఈ సినిమాకు పూర్తి న్యాయం చేశారు. మంచి కథ, ఆసక్తికరమైన పాత్రలతో చిత్రాన్ని అందంగా తీర్చిదిద్దారు. ఫన్, ఎమోషన్ వంటి అంశాలని సమపాళ్లలో ఉంచి సగటు ప్రేక్షకుడిని అలరించే సినిమాను తయారుచేశారు. కాకపోతే సినిమా సెకెండ్ హాఫ్ పై ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది.

సంగీత దర్శకుడు వివేక్ సాగర్ అందించిన నేపధ్య సంగీతం కూడా బాగుంది. సినిమాటోగ్రఫీ సినిమాకి తగట్లు ఉంది. సన్నివేశాలన్నీ చాలా సహజంగా సినిమా మూడ్ కి అనుగుణంగా నడుస్తాయి.

నిర్మాత కరాటీ రాజు ప్రొడక్షన్ డిజైన్ కూడా ఆకట్టుకుంటుంది.

తీర్పు :

విశ్వక్ సేన్ దర్శకుడిగా హీరోగా చేసిన ఈ తొలి ప్రయత్నం ఆయన కెరీర్ కు మాత్రం మంచి ఫలితాన్నే ఇస్తుంది. సినిమాలో తన నటనతో, మ్యానరిజమ్స్ తో.. విశ్వక్ సేన్ హీరోగా దర్శకుడిగా తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు. ముఖ్యంగా ఈ చిత్రంలోని డైలాగ్స్, టేకింగ్, నటీనటుల నటన.. ప్రధానంగా విశ్వక్ సేన్, తరుణ్ భాస్కర్ నటన సినిమాలోనే హైలెట్ గా నిలుస్తాయి. అలాగే ప్రేమ మరియు ఫ్రెండ్షిప్ తాలూకు ఎమోషన్స్ ను బాగా ఎలివేట్ చేశారు. అయితే సెకెండ్ హాఫ్ బాగా స్లోగా సాగడం, రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం, కొన్ని చోట్ల పేలవమైన కథనం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్లుగా నిలిచాయి. మొత్తానికి ఫలక్ నుమా దాస్ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అయితే మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
123telugu.com Rating :  2.75/5

Reviewed by 123telugu Team

Click here for English Review

 

సంబంధిత సమాచారం :

More