‘ఖైదీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ విషయంలో గందరగోళం !

khaidi-150-1
మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నెం 150’ ప్రీ రిలీజ్ ఈవెంటును ముందుగా జనవరి 4న విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో నిర్వహించాలని తలచిన సంగతి తెలిసిందే. కానీ నిన్న సంబందిత అధికారులు ఆ స్టేడియంలో క్రీడా కార్యక్రమాలు మినహా సినిమా కార్యక్రమాలు నిర్వహించడానికి వీల్లేదని గతంలో హై కోర్ట్ ఉత్తర్వులు జారీ చేసిందని కనుక ఫంక్షన్ కుదరదని తేల్చారు. దీంతో ఖైదీ టీమ్ కార్యక్రమాన్ని గుంటూరు దగ్గర్లోని చినకాకాని వద్ద గల హాయ్ ల్యాండ్ లో నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు.

ఒకవేళ అది కూడా కుదరకపోతే కెఎల్ యూనివర్సిటీ గ్రౌండ్స్ లో అయినా నిర్వహించాలని దాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు అభిమానులు మాత్రం విజయవాడ అధికారులు చివరి క్షణంలో ఇలా పర్మిషన్ రద్దు చేసి ఇబ్బందిపెడుతున్నారని, హై కోర్ట్ ఉత్తర్వుల సంగతి ముందే చెప్పుండాల్సిందని విజయవాడలోని గాంధీ నగర్లో నిరసనకు దిగారు. అలాగే ఈరోజు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రభుత్వంపై విమర్శలకు దిగుతూ తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఈ ఈవెంట్ వేదిక ఎక్కడో స్పష్టంగా తెలియాలంటే ఈరోజు సాయంత్రం వరకు ఆగాల్సిందే.