వేగానికి కేరాఫ్ అడ్రెస్ పూరి జగన్నాథ్. ఈయన సినిమాను మొదలుపెట్టారు అంటే గ్యాప్ లేకుండా పూర్తి చేసేస్తారు. షెడ్యూల్ గ్యాప్ తప్ప మరొక బ్రేక్ ఉండదు. అందుకే ఆయనతో సినిమా అంటే నిర్మాతలకు ప్రశాంతంగా ఉంటుంది. ఇక నటీనటులు కూడ అంతే. పూరితో సినిమా అంటే ఎప్పుడు మొదలైంది, ఎప్పుడు పూర్తైంది అనేది కూడ తెలియదని అంటుంటారు. సినిమా లాంచ్ రోజునే రిలీజ్ డేట్ ప్రకటించి చెప్పిన తేదీ కంటే కొన్ని రోజుల ముందే రిలీజ్ చేసిన ట్రాక్ రికార్డ్ పూరికి ఉంది.
అలాంటి పూరి ఎందుకో కాస్త స్లో అయ్యారనే అనిపిస్తోంది. ‘ఇస్మార్ట్ శంకర్’ లాంటి హిట్ తర్వాత ఆయన విజయ్ దేవరకొండతో సినిమాను ప్రకటించారు. ‘లైగర్’ అనేది ఈ సినిమా టైటిల్. షూటింగ్ ముంబైలో మొదలైంది. దీన్ని పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు. హిందీలో కూడ రూపొందుతోంది ఈ చిత్రం. కానీ లాక్ డౌన్ కారణంగా సినిమా ఆగిపోయింది. త్వరలోనే ముంబైలో మొదలుకానుంది షూట్. అయితే పూరి ఇప్పటివరకు సినిమా విడుదల తేదీ మీద క్లారిటీ ఇవ్వలేదు.
గత నాలుగైదు రోజులుగా నిర్మాణ దశలో ఉన్న అన్ని సినిమాల విడుదల తేదీలను ప్రకటించేస్తున్నారు. త్వరలో ప్రారంభంకానున్న సినిమాల డేట్లను కూడ ఫిక్స్ చేసేసి అనౌన్స్ చేస్తున్నారు. దీంతో పూరి జగన్నాథ్ ‘లైగర్’ రిలీజ్ డేట్ మీద డిస్కషన్ మొదలైంది. అందరూ రిలీజ్ డేట్లను కన్ఫర్మ్ చేసుకుని కూర్చుంటే పూరి ఇంకా డేట్ రివీల్ చేయలేదు ఏమిటని అడుగుతున్నారు ఆయన అభిమానులు. మరి డాషింగ్ డైరెక్టర్ రిలీజ్ తేదీని ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.


