హర్ష నర్రా, తన్మయి ఖుషి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మోడ్రన్ మిస్సమ్మ’. లాస్య అండ్ మిధున క్రియేషన్స్ పతాకంపై చిరంజీవి పమిడి, శివ పమిడి, కిరణ్ కుమార్ నల్లూరి, స్రవంతి నంబూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాయిబాబా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ సింగిల్ ‘బెటర్ బీ ఏ మిస్సమ్మ’ పాటను బుధవారం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో చిత్ర యూనిట్ ఆవిష్కరించింది.
గోపీ సుందర్ సంగీతం సమకూర్చిన ఈ పాటకు కిట్టు విస్సాప్రగడ సాహిత్యం అందించారు. పెళ్లిని వద్దనుకునే ఒక ఆధునిక యువతి ఆలోచనల నేపథ్యంలో సాగే ఈ పాట నేటితరం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉందని చిత్ర బృందం పేర్కొంది.
సినిమా అనుకున్న ప్రణాళిక, బడ్జెట్లోనే పూర్తయిందని నిర్మాత చిరంజీవి పమిడి తెలిపారు. ప్రస్తుత ట్రెండ్‌కు సరిపోయే కథాంశంతో, కుటుంబ ప్రేక్షకులకు సైతం కనెక్ట్ అయ్యేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు దర్శకుడు సాయిబాబా వివరించారు. ఈ సినిమాలో డాక్టర్ భద్రం, శివన్నారాయణ, ప్రమోదిని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
