
ఇప్పుడు ఎక్కడ చూసినా రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మికంగా తెరకెక్కించిన ‘బాహుబలి’ సృష్టిస్తోన్న రికార్డుల ప్రస్తావనే! తెలుగు, తమిళ, హిందీ, మళయాల భాషల్లో ఏకకాలంలో గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా విడుదలైన అన్నిచోట్లా అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకోవడమే కాక, బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. భారతీయ సినిమా గర్వించదగ్గ సినిమాగా ఈ సినిమాను పలువురు ప్రశంసిస్తున్నారు. ఒక్క సినీ ప్రముఖుల నుంచే కాక, క్రీడా, రాజకీయ, వ్యాపారవర్గాల నుంచి కూడా బాహుబలికి కనీవినీ ఎరుగని రీతిలో రెస్పాన్స్ రావడం విశేషం.
ఇక కేవలం ఇండియాలోనే కాక అమెరికాలోనూ రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతున్న బాహుబలిపై అక్కడి ప్రఖ్యాత పత్రికలు కొన్ని ఆసక్తికర కథనాలను ప్రచురించడం మరింత విశేషంగా కనిపిస్తోంది. అమెరికాలో పేరొందిన పత్రికలైన ది గార్డియన్, హాలీవుడ్ రిపోర్టర్, వెరైటీ, న్యూయార్క్ టైమ్స్ లాంటి పత్రికలు బాహుబలి గురించి ప్రస్తావించగా, తాజాగా ప్రపంచవ్యాప్తంగా అందరికీ సుపరిచితమైన ఫోర్బ్స్ మ్యాగజైన్లో కూడా బాహుబలి కథనాలు ప్రచురితమవడం ఆసక్తికరంగా మారింది.
ఇండియాలో అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కిన బాహుబలి, అద్భుతమైన విజువల్స్‌తో, ఆర్ట్ వర్క్స్‌తో ఆకట్టుకుందని, రాజమౌళి విజన్ ప్రస్తావించదగ్గ విషయమని చెబుతూ ఈ మ్యాగజైన్లు బాహుబలిపై ప్రశంసలు కురిపిస్తున్నాయి. ఇక బాక్సాఫీస్ పరంగా బాహుబలి ఇండియన్ సినిమాకు ఓ కొత్త దారిని చూపాయని ఫోర్బ్స్ పత్రిక ఈ సందర్భంగా తన అభిప్రాయాన్ని తెలిపింది.

