రాశీ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘గాసిప్’. వైభవ్ కౌండిన్య దర్శకత్వం వహించిన ఈ సినిమాను వైభవ్ సినీ స్కల్ప్ట్ స్టూడియోస్ బ్యానర్‌పై యతి నిర్మించారు. సామాజిక అంశాలకు ప్రేమకథను జతచేసి సోషల్ సెటైర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ నెల 26న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
ఈ సినిమాలో రవివర్మ కీలక పాత్ర పోషించగా, మహేష్ యడ్లపల్లి, పృథ్వీరాజ్, విజయ్ అదిరాజు, ఫాల్గుణి, శృతి తదితరులు నటించారు. శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందించారు. సమాజంలోని ప్రస్తుత పరిస్థితులను ప్రతిబింబించేలా ఈ కథ ఉంటుందని, ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు సానుకూల స్పందన లభిస్తోందని చిత్ర బృందం పేర్కొంది.
ఈ సినిమా అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. పీవీఆర్ సినిమాస్ సహకారంతో చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు వైభవ్ కౌండిన్య, నిర్మాత యతి మాట్లాడుతూ.. సాంకేతిక బృందానికి, నటీనటులకు కృతజ్ఞతలు తెలిపారు. చిన్న సినిమాలను ప్రేక్షకులు ఆదరించి ప్రోత్సహించాలని వారు కోరారు.


